 
													ఆడిషన్స్ పేరిట పిలిచి 17 మంది టీనేజర్లను బంధించిన స్టూడియో ఉద్యోగి
పోలీసులు అతి తెలివి చూపిస్తే స్టూడియో తగలబెడతానని బెదిరింపులు
మొత్తం 19 మందిని రక్షించిన పోలీసులు
పోలీసుల ఎదురు కాల్పుల్లో కిడ్నాపర్ మృతి
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం కిడ్నాప్ కలకలం సృష్టించింది. వెబ్‌సిరీస్ రూపొందించేందుకు ఆడిషన్స్ పేరిట ఓ వ్యక్తి ఎనిమిది నుంచి 14 ఏళ్ల వయసు పిల్లల్ని ఆర్‌ఏ స్టూడియోకి రప్పించి కిడ్నాప్ చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు 17 మంది పిల్లల్ని, ఒక వృద్ధుడిని, మరో వ్యక్తిని రక్షించారు. పోలీసులపై కాల్పులు జరిపిన కిడ్నాపర్ రోహిత్ ఆర్య (50) ఎదురు కాల్పుల్లో మృతిచెందాడు. ఆ స్టూడియోలో పనిచేసే కిడ్నాపర్ మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన వివరాలను సంయుక్త పోలీస్ కమిషనర్ సత్యనారాయణన్ మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు..
అసలేం జరిగింది?
ముంబైలో పొవాయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహావీర్ క్లాసిక్ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఆర్‌ఏ స్టూడియో ఉంది. ఇందులో పనిచేసే రోహిత్ ఆర్య రెండు రోజులుగా ఒక వెబ్‌సిరీస్ కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. గురువారం దాదాపు 100 మంది వచ్చారు. వీరిలో 17 మందిని ఆపేసి ఒక గదిలో బంధించాడు. దీంతో భయపడిన పిల్లలు కేకలు వేయడంతో రహదారిపై వెళుతున్న ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య బృందం, క్విక్ రెస్పాన్స్ బృందాలతో కలిసి స్టూడియోకు వచ్చారు. ఆలోపే ఆర్య ఒకటిన్నర నిమిషం నిడివితో ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశాడు. ‘ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నా ప్లాన్ అమలుచేద్దామనుకున్నా. అందుకే పిల్లల్ని కిడ్నాప్ చేశా.
నేను కొందరిని ప్రశ్నించి వాళ్ల సమాధానాలు వినాలనుకుంటున్నా. పోలీసులు ఏమైనా తెలివితేటలు ప్రదర్శిస్తే.. తర్వాత ఈ పిల్లలకు ఏదైనా హాని జరిగితే దానికి నేను బాధ్యుడిని కాదు. పోలీసులు అతి తెలివి చూపిస్తే ఈ స్టూడియో మొత్తాన్ని తగలబెడతా..’ అని ఆ వీడియోలో చెప్పాడు. ఆర్యను శాంతిపజేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో పోలీసులు స్టూడియో లోపలికి వెళ్లేందుకు మార్గం వెతికారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో మొదటి అంతస్తు కిటికీ వద్దకు చేరుకున్నారు. తర్వాత ఎనిమిదిమంది కమెండోలు బాత్‌రూమ్ ద్వారా స్టూడియో లోపలికి ప్రవేశించారు. పోలీసుల రాకను గమనించిన ఆర్య తన చేతిలో ఉన్న లైటర్ చూపిస్తూ పిల్లల వద్ద ఉన్న రసాయన డబ్బాలను తగులబెడతానని బెదిరిస్తూనే ఎయిర్‌గన్‌తో పోలీసులపై కాల్పులు మొదలెట్టాడు.
⇒ పోలీసులు ఎదురుకాల్పులు జరపటంతో ఆర్యకు బుల్లెట్ల గాయాలయ్యాయి. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారని జోన్–10 పోలీస్ డిప్యూటీ కమిషనర్ దత్తు నలవాడే చెప్పారు. బందీలందరినీ రక్షించాక స్టూడియోలో పోలీసులు ఒక ఎయిర్‌గన్, పలు రసాయన కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో అతడు విధ్వంసం సృష్టించాలని కుట్రపన్ని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను కమెండోలు కేవలం 35 నిమిషాల్లో విజయవంతంగా ముగించారు.
ఎవరీ కిడ్నాపర్ ?
నాగ్‌పూర్‌కు చెందిన ఆర్య సొంతంగా యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ప్రస్తుతం ముంబైలోని చెంబూర్‌లో ఉంటూ ఈ స్టూడియోలో పనిచేస్తున్న అతడు 12 ఏళ్ల కిందట ‘లెట్స్ చేంజ్’ కార్యక్రమం మొదలెట్టాడు. పాఠశాల చిన్నారులను శుభ్రతకు అంబాసిడర్‌లుగా మార్చడం ఈ కార్యక్రమం ఉద్దేశం. నాటి విద్యాశాఖ మంత్రి దీపక్ కేసార్కర్ హయాంలో ఆర్య ఈ కాంట్రాక్టు సంపాదించాడు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అతడికి రూ.2 కోట్లు రావాల్సి ఉంది. బకాయిలు చెల్లించాలంటూ గతేడాది జనవరిలో రెండుసార్లు నిరాహారదీక్ష చేశాడు. మంత్రి నివాసం ఎదుట కూడా ధర్నా చేశాడు. దీంతో అతడికి మంత్రి రూ.7 లక్షలు, రూ.8 లక్షల చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు చెల్లలేదు. మోసపోయానని గ్రహించిన ఆర్య ఆగ్రహంతో ఈ దుస్సాహసం చేసుంటాడని భావిస్తున్నారు.  

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
