నేడు సుప్రీంకోర్టులో వాదనలు
కోల్‌కతా/న్యూఢిల్లీ: ఐప్యాక్ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు బుధవారం కొట్టేసింది. ఆ దాడుల సందర్భంగా ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ కార్యాలయం, నివాసం నుంచి ఎలాంటి ఫైళ్లనూ తాము జప్తు చేయలేదని ఈడీ పేర్కొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనుంది.
దాడుల సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ పలు ఫైళ్లు తదితరాలను దౌర్జన్యంగా లాక్కెళ్లడం ద్వారా తమ విధులకు ఆటంకం కలిగించారని ఈడీ తన పిటిషన్‌లో ఆరోపించింది. న్యాయమూర్తులు జస్టిస్ ప్రకాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ విపుల్ పంచోలీల ధర్మాసనం ఈ కేసును విచారించే అవకాశముంది.
ఈ అంశానికి సంబంధించి తమ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయొద్దని కోరుతూ బెంగాల్ సర్కారు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయడం తెల్సిందే. ఐప్యాక్ కార్యాలయంపై దాడుల్లో జప్తు చేసిన ఫైళ్లు తదితరాల్లోని డేటా సురక్షితంగా ఉంచేలా ఈడీని ఆదేశించాలంటూ టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.
కానీ ఆ సందర్భంగా ఎలాంటి ఫైళ్లు, డేటానూ ఈడీ జప్తు చేయలేదని అదనపు సొలిసిటర్ జనరల్ రాజు బుధవారం విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. మమత స్వయంగా వచ్చి అన్ని ఫైళ్లు, డిజిటల్ పరికరాలను అక్కడినుంచి తీసుకెళ్లారని స్పష్టం చేశారు. దాంతో టీఎంసీ పిటిషన్‌ను మూసేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ సుర్వా ఘోష్ పేర్కొన్నారు. నాటి ఘటనలపై ఈడీ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇదే అంశంపై సుప్రీంలో ఈడీ పిటిషన్ వేసినట్టు రాజు తెలిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నారు.


