
న్యూఢిల్లీ: భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) దేశ సరిహద్దుల్లో మోహరింపునకు భారత శునక జాతులను ఎంచుకోవాలని నిర్ణయించింది. ఇప్పటివరకు 20 జాతులకు చెందిన 150 శునకాలకు శిక్షణ అందించింది. ఈ జాతులలో రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్ ప్రధానంగా ఉన్నాయి. శునకాలను దత్తత తీసుకోవాలనుకుంటున్నవారు భారత శునక జాతులను ఎంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’లో కోరారు. దీనిని అమలు చేసేందుకు బీఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.
‘మన్ కీ బాత్’లో ప్రధాని వినతి దరిమిలా బీఎస్ఎఫ్ భారత శునక జాతి కుక్కలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ఇప్పటివరకు మేము 150 భారత జాతి శునకాలకు శిక్షణ ఇచ్చాం. వాటిని సరిహద్దుల్లో మోహరించాం. 20 శునకాలు బ్రీడింగ్ సెంటర్‌లో ఉన్నాయి’ అని టెకాన్‌పూర్‌లోని బీఎస్ఎఫ్ అకాడమీ ఏడీజీ, డైరెక్టర్ షంషేర్ సింగ్ తెలిపారు. బీఎస్‌ఎఫ్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత పలు ఛాంపియన్‌షిప్‌లలో విదేశీ జాతి శునకాలను ఓడించిన భారత జాతి శునకం ‘రియా’ కథను సింగ్ పంచుకున్నారు.
‘ఇక్కడ రియా అనే కుక్క ఉంది. దానిని ఇక్కడే పెంచి, శిక్షణ ఇచ్చారు. 2024లో దానికి ఉత్తమ ట్రాకర్ డాగ్ అవార్డు వచ్చింది. ఛాంపియన్‌షిప్‌లో అది పలు విదేశీ జాతి శునకాలను ఓడించి, ఉత్తమ శునకం అవార్డు గెలుచుకుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ సాధించిన విజయం. మేము రాంపూర్ హౌండ్, ముధోల్ హౌండ్ జాతులకు శిక్షణ ఇస్తున్నాం. ఇవి చాలా చురుకుగా ఉంటాయి. ఎత్తు నుండి దూకేటప్పుడు ఇతర జాతుల శునకాల కంటే చాలా మెరుగ్గా స్పదిస్తాయి. మేము సరిహద్దు వద్ద దాదాపు 700 కుక్కలను మోహరించాం’ అని ఆయన తెలిపారు.
2020లో ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ.. విపత్తు నిర్వహణ, రెస్క్యూ ఆపరేషన్లలో గణనీయమైన కృషి చేసినందుకు భారత జాతి శునకాలను ప్రశంసించారు. ఈ శునకాలకు దేశంలోని వివిధ సవాళ్లతో కూడిన పనులకు అనువైనవన్నారు. భారత శునక జాతులు దేశ పర్యావరణం, వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు.