ఎమ్మెల్యేల విచారణలో ఉద్దేశపూర్వకంగానే తాత్సారం
సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని నిరాకరించిన ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంలో స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని, స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో ఈ ఏడాది జూలై 31న సీజేఐ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ కార్యాలయం అమలు చేయలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ తదితరులు సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
సుప్రీం ఆదేశాల అమలులో జాప్యం చేసినందుకు స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని ధిక్కార పిటిషన్‌లో కోరారు. అలాగే, సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ అమలు చేయనందుకు ఆ 10మంది ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టే అనర్హులుగా ప్రకటించాలని మరో రిట్ పిటిషన్‌లో కోరారు. ఈ రెండు పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని న్యాయవాది మోహిత్ రావు సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు.
స్పీకర్ చర్య తీసుకోలేదు
‘సాధ్యమైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనర్హత పిటిషన్‌లో పేర్కొన్న ఎమ్మెల్యేలు విచారణను ఆలస్యం చేయడానికి యత్నిస్తే.. అటువంటి చర్యలను అనుమతించకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణను ఆలస్యం చేసేందుకు ఎమ్మెల్యేలు యతి్నస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్‌కు సూచించింది. కానీ.. ఈ వ్యవహారంలో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిరాయింపు అంశంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలోనూ స్పీకర్ కనీసం స్పందించలేదు. ఇది ఉద్దేశపూర్వంగా చేస్తున్న తాత్సారమే’అని మోహిత్ రావు వివరించారు.
సుప్రీంకోర్టేమీ బంద్ కాదు కదా?
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ నెల 24న పదవీ విరమణ చేస్తున్నందున అప్పటి వరకు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం విచారణకు రాకుండా ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని మోహిత్ రావు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘నేను సీజేఐగా రిటైరైతే ఏమిటి? నవంబర్ 24 తర్వాత సుప్రీంకోర్టు ఏమీ బంద్ కాదు కదా?’అని వ్యాఖ్యానిస్తూ అత్యవసర విచారణకు నిరాకరించారు. తదుపరి వచ్చేవారు ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపడతారని స్పష్టం చేశారు. అయితే, తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణ జరిపేందుకు మరో 8 వారాల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం కోరిన విషయం తెలిసిందే.
సమయం సరిపోలేదు..
‘నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో నలుగురికి సంబంధించిన విచారణ చివరి దశకు చేరింది. మరో ఇద్దరి విచారణ ప్రారంభమైంది. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ అధికారాలు, రోజువారీ కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనలు వంటి కార్యక్రమాల్లో స్పీకర్ బిజీగా ఉండటంతో సుప్రీంకోర్టు విధించిన గడువులోగా విచారించడం సాధ్యంకాలేదు.
శాసన సభ్యులు సైతం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అకాల వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు తదితర కారణాలతో నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వస్తోంది. అందువల్ల సమయం సరిపోలేదు’అని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో అక్టోబర్ 31న మిస్‌లీనియస్ అప్లికేషన్ (ఎంఏ) దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 14న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపైనా అదేరోజు విచారణ జరిగే అవకాశం ఉంది.


