రాజకీయ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి

Bring political issues to the attention of the government says cji nv ramana - Sakshi

న్యాయవాదికి స్పష్టం చేసిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అంశాలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి ఇలాంటి అంశాలను పరిశీలించడానికి తగిన అధికారం ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలు, బంగ్లాదేశ్‌ జాతీయులను సంవత్సరంలోగా గుర్తించి, నిర్భంధించి, దేశం నుంచి బహిష్కరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ గురువారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు.

‘‘పార్లమెంట్‌ సభ్యుల సమస్య, నామినేషన్‌ సమస్య, ఎన్నికల సంస్కరణలు ఇలా ప్రపంచంలోని ఎన్నో సమస్యలు, దాంతోపాటు ఇక ప్రతిరోజూ మీ కేసును మాత్రమే వినాలి! అవి రాజకీయ అంశాలు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి. మీరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను(పిల్‌) మేము(న్యాయస్థానం) విచారణకు స్వీకరించాల్సి వస్తే.. ఇక ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నట్టు? చట్టాలు చేయడానికి రాజ్యసభ, లోక్‌సభ ఉన్నాయి’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ పిటిషన్‌కు కౌంటరు వేయాలని కేంద్రం భావిస్తే జాబితాలో చేరుస్తామని చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top