
డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిరిక్- కుర్సియాంగ్ పర్యాటక ప్రదేశాలను కలిపే దుడియా ఐరన్ వంతెన కూలిపోయింది. కుర్సియాంగ్ సమీపంలోని జాతీయ రహదారి 110 వెంబడి కొండచరియలు విరిగిపడ్దాయి.
ఉత్తర బెంగాల్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమయ్యింది. డార్జిలింగ్‌లోని మిరిక్, సుఖియా పోఖారిలలో కొండచరియలు విరిగిపడి 14 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో పశ్చిమ బెంగాల్ - సిక్కిం మధ్య రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. డార్జిలింగ్- సిలిగురి మధ్య ప్రధాన రహదారి మూసుకుపోయింది. భారీ వర్షపాతం జల్పైగురి, సిలిగురి, కూచ్‌బెహార్‌లను ప్రభావితం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. చిత్రే, సెల్ఫీ దారా తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి-10లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
సోమవారం ఉదయం వరకు పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. డార్జిలింగ్, కాలింపాంగ్, కూచ్ బెహార్, జల్పైగురి, అలీపుర్దువార్ జిల్లాలలో ఆదివారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఈ ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తర బెంగాల్‌లోని పొరుగు జిల్లా అలీపుర్దువార్‌లో సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.
పశ్చిమ జార్ఖండ్, దక్షిణ బీహార్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా ఆవరించిన అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా బీహార్ వైపు కదిలి, క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముర్షిదాబాద్, బిర్భూమ్, నదియా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పశ్చిమ బెంగాల్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని, బంకురాలో అత్యధికంగా 65.8 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.