సాయిబాబా నిర్దోషి  | Sakshi
Sakshi News home page

సాయిబాబా నిర్దోషి 

Published Wed, Mar 6 2024 4:08 AM

Bombay HC acquits DU ex professor Saibaba and others in suspected Maoist links case - Sakshi

మావోయిస్టులతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు తీర్పు

కేసు నుంచి మరో ఐదుగురికి విముక్తి  

ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని వ్యాఖ్య  

సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో సాయిబాబాతో పాటు ఇతరులను దోషులుగా నిర్ధారిస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై నాగ్‌పూర్‌ బెంచ్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ వినయ్‌ జోషీ, జస్టిస్‌ వాల్మికి మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని, అందుకే వారిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.

నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది.  మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, దేశంపై యుద్ధంపై చేసే కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2017 మార్చిలో సాయిబాబా, ఇతరులను మహారాష్ట్రలోని గడ్చిరోలీ సెషన్స్‌ కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీనిపై సాయిబాబా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14న జస్టిస్‌ రోహిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి రోజు శనివారమైనప్పటికీ ప్రత్యేకంగా విచారించింది.

హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జస్టిస్‌ షా, జస్టిస్‌ రవికుమార్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2023 ఏప్రిల్‌ 19న బాంబే హైకోర్టు తీర్పును పక్కనపెట్టింది. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని బాంబే హైకోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ జోషీ, జస్టిస్‌ వాల్మికిల హైకోర్టు ధర్మాసనం విచారించి, సాయిబాబా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించింది. ప్రొఫెసర్‌ సాయిబాబా 2014లో అరెస్టయ్యారు. ప్రస్తుతం నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు.  

పదేళ్ల పోరాటం తర్వాత ఊరట దక్కింది 
బాంబే హైకోర్టు తీర్పు పట్ల సాయిబాబా భార్య వసంత ఆనందం వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ఊరట లభించిందన్నారు. సాయిబాబాకు అండగా నిలిచిన లాయర్లకు, సామాజిక కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త పది సంవత్సరాలు జైలులో ఉన్నారని, ఆర్థికంగా, మానసికంగా తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. సాయిబాబా గురించి ప్రజలకు వాస్తవాలు తెలుసని, ఆయన పట్ల వారికి సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సర్కారు పిటిషన్‌  
మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పును  సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది.

సాయిబాబాతోపాటు ఇతరులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని మహారాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ బీరేంద్ర షరాఫ్‌ ఈ సందర్భంగా చెప్పారు. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును కొంతకాలం నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్లికేషన్‌ దాఖలు చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పునఃపరిశీలించే అధికారం ఉండదని, ఇది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది. అడ్వొకేట్‌ జనరల్‌ దాఖలు చేసిన అప్లికేషన్‌ను కొట్టివేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement