
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం.. నేడు ప్రకటించే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచే పార్టీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూడు పేర్లను ముందు పెట్టుకుని చర్చించిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ.. అందులో ఒక పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ప్రధానంగా పోటీలో ఉన్న దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలతల్లో ఒకరి పేరును ఖరారుచేసినట్లు తెలుస్తోంది. బిహార్ సహా జూబ్లీహిల్స్ అభ్యరి్థత్వాలపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన కమిటీ ఆదివారం సమావేశమైంది.
ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఇప్పటికే అధిష్టానం పెద్దలకు నివేదిక అందించారు. దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలతల పేర్లతోనే ఆ నివేదిక అందింది. కమిటీ దీపక్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు. అభ్యరి్థని సోమవారం ప్రకటించే అవకాశం ఉందని కె.లక్ష్మణ్ చెప్పారు.