ఉత్తరంలోనే కమలం హవా... దక్షిణాదిన అంతంతే, మెరుగవుతున్న కాంగ్రెస్‌

BJP continues dominating in north and northeast India - Sakshi

కర్ణాటక ఫలితాలతో దేశ రాజకీయ ముఖచిత్రం మారింది. బీజేపీ ఇప్పటికీ ఉత్తరభారతం, ఈశాన్య భారతంలో తన పట్టు ప్రదర్శిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత దశాబ్ద కాలంలో దేశ రాజకీయాల్లో పెనుమార్పులే వచ్చాయి. దక్షిణాదిలో పెద్దగా బలం పుంజుకోలేకపోయినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం బీజేపీ తన పట్టు కొనసాగిస్తూ వస్తోంది..

దక్షిణం మినహా...
దశాబ్ద కాలంగా బీజేపీ అత్యధికంగా పట్టు నిలుపుకున్నది ఉత్తరాది రాష్ట్రాల్లోనే. అయితే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో 2017 నాటికి 60 శాతం అసెంబ్లీ స్థానాలు బీజేపీ ఖాతాలో ఉంటే, 2022 నాటికి 47 శాతానికి తగ్గాయి. 2023కు మరింత తగ్గి 44 శాతానికి పరిమితమైంది. ఉత్తరాదిన యూపీలో బీజేపీ వరస విజయాలతో ఊపు మీదుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు కూడా బీజేపీ వైపే ఉన్నాయి. 2012లో అక్కడ ఏమాత్రం బలం లేని కమలదళం పదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది.

మొత్తం 498 ఈశాన్య అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి అప్పట్లో కేవలం 2 శాతం స్థానాలే ఉండగా ఇప్పుడది ఏకంగా 36 శాతానికి పెరిగింది పశ్చిమ భారతంలోనూ బీజేపీయే కీ ప్లేయర్‌. గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీకి 2012లో 44% సీట్లుండగా ఇప్పుడు 52 శాతానికి పెరిగాయి. తూర్పుభారతంలోనూ బీజేపీ మెరుగవుతూ వస్తోంది. బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో 2012లో బీజేపీకి ప్రతి ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఒక్కరే ఉండగా ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకరున్నారు.

ప్రాంతాలవారీగా ఎమ్మెల్యేల బలాబలాలు
► గత 11 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలం తగ్గుతూ వస్తోంది. 2013, 2018లో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్‌కు కలిసిరాలేదు.  
► ఇన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌యేతర పార్టీలు అసెంబ్లీల్లో తమ పట్టు కొనసాగిస్తూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగానున్న ఎమ్మెల్యేలలో 50% మంది ప్రాంతీయ పార్టీల్లోనే ఉన్నారు. రాష్ట్రాల్లోని 3వ వంతు మంది ఎమ్మెల్యేలు బీజేపీకి చెందిన వారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతీ 10 మంది ఎమ్మెల్యేలలో బీజేపీకి ఒకరే ఉన్నారు.  
 ► 2012 మార్చిలో కాంగ్రెస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా 1,224 మంది ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీకి 845 మంది ఉన్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా హస్తం హవా ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టేసి క్రమంగా బీజేపీ బలపడుతూ వచ్చింది. 2023 మే నాటికి దేశంలో 4,033 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో బీజేపీకి చెందినవారు 1,329 కాగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 735కి తగ్గిపోయారు.  

కాంగ్రెస్‌ మరింత పట్టు పెంచుకుంటుందా?
2012–22 మధ్య దేశవ్యాప్తంగా బీజేపీ అదనంగా 540 ఎమ్మెల్యే స్థానాలను సంపాదించుకుంటే కాంగ్రెస్‌ 505 సీట్లు కోల్పోయింది! రాహుల్‌ గాంధీ పాదయాత్ర తర్వాత కర్ణాటకలో సాధించిన విజయం నేపథ్యంతో మున్ముందు తన పట్టు ఇంకా పెరుగుతుందని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం గ్రాఫ్‌ మరింత మెరుగవుతుందని ఆశిస్తోంది.
–సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top