
న్యూఢిల్లీ: బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో రాబోయే ఎన్నికలకు పోల్ ఇన్‌చార్జ్‌లను నియమించడం ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాత్మక ముందడుగు వేసింది. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ నియామకాలు కీలక రాష్ట్రాలలో ప్రచార యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయుక్తమవుతాయని పార్టీ భావిస్తోంది.
బీహార్‌లో ధర్మేంద్ర ప్రధాన్, తమిళనాడులో బైజయంత్ పాండా పశ్చిమ బెంగాల్‌లో భూపేంద్ర యాదవ్ పోల్ ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఆర్ పాటిల్, కేశవ్ ప్రసాద్ మౌర్య సహ ఇన్‌చార్జ్‌లుగా పనిచేయనున్నారు. ఈ బృందం పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, కార్యకర్తలను సమీకరించడం, రాష్ట్రంలో బలమైన బీజేపీ ఉనికిని చాటేందుకు వ్యూహాలను అమలు చేయడం తదితర బాధ్యతలను చేపడుతుంది. తమిళనాడులో బీజేపీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను బైజయంత్ పాండాకు అప్పగించారు. మురళీధర్ మోహోల్ అతనికి సహ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు.
పశ్చిమ బెంగాల్‌కు పోల్ ఇన్‌చార్జ్‌గా భూపేంద్ర యాదవ్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. బిప్లాబ్ కుమార్ దేబ్ ఆయనకు సహ ఇన్‌చార్జ్‌గా మద్దతునిస్తున్నారు. వారి ఉమ్మడి నాయకత్వం రాష్ట్రంలో బీజేపీ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందని పార్టీ భావిస్తోంది. అనుభవజ్ఞులైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ప్రచార నిర్వహణ, ఓటర్ల సమీకరణకు సమన్వయ విధానాన్ని రూపొందించనుంది. ఈ నూతన నియామకాలు బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నాయి. ప్రణాళికాబద్ధమైన వ్యూహాలను అమలు చేసే దిశగా పార్టీలోని సీనియర్ నేతల సలహా, సంప్రదింపులను బీజేపీ తీసుకుంటున్నదని సమాచారం.