
పట్నా: బిహార్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. విషం చిమ్మే తాచుపామును కొరికి కూడా ఏడాది వయసు పిల్లాడు బతికి బట్టకట్టిన విషయం తెలిసిందే. బొమ్మ అనుకుని పామును పట్టుకున్న పిల్లవాడు. దానిని నోటితో కొరికి చంపాడు. స్వల్ప విష ప్రభావంతో ఆస్పత్రిపాలైన బుడ్డోడు.. చివరకు ప్రాణాలతో బయపడ్డాడు. అయితే పామును కొరికినప్పటికీ పిల్లాడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంపై సర్వత్రా ఆశ్యర్చానికి గురవుతున్నారు.
తాజాగా చిన్న పిల్లాడు బతికి బయటపడటంపై గల కారణాలను వైద్యులు వెల్లడించారు. సాధారణంగా పాము వ్యక్తులను కరిచినప్పుడు దానికున్న విషం రక్తంలోకి ప్రసరిస్తుందని, ఇది , నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలిపారు. దీనివల్ల అనారోగ్యానికి గురికావడం లేదా కొన్నిసార్లు మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నారు.
అయితే గోవింద్ విషయంలో విషం నోటి ద్వారా జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించిందన్నారు. మానవ జీర్ణవ్యవస్థ కొన్ని సందర్భాల్లో విషాన్ని విచ్ఛిన్నం చేసి తట్టుకోగలదని, ప్రాణాపాయాన్ని నివారిస్తుందన్నారు. ఒకవేళ శరీరంలో అంతర్గత రక్తస్రావం అయితే.. బాలుడుపరిస్థితి భిన్నంగా ఉండేదని, కానీ అదృష్టవశాత్తు అలాంటి సమస్యలు ఏం రాలేదని అన్నారు.
అసలేం జరిగిందంటే.. బీహార్‌లో, ఏప్రిల్ 2023 మరియు మార్చి 2024 మధ్య 934 మంది పాముకాటు కారణంగా మరణించారని ప్రభుత్వ డేటా చూపిస్తుంది. అదే సమయంలో, 17,800 మందికి పైగా రాష్ట్ర ఆసుపత్రులలో పాముకాటుకు చికిత్స పొందారు వెస్ట్‌చంపారన్ జిల్లాలోని మొహఛీ బంకాత్వా గ్రామంలో గోవింద్ కుమార్ అనే ఏడాది వయసు పిల్లాడిని తల్లి ఇంటి వరండాలో వదిలేసి సమీపంలో వంటచెరకు సేకరిస్తోంది. అదే సమయంలో పిల్లాడి వైపు ఒక తాచుపాము వచ్చింది.
దీనిని బొమ్మగా భావించిన పిల్లాడు పక్కన ఉన్న వస్తువుతో కొట్టాడు. దాంతో అది పిల్లాడి అరచేతికి చుట్టుకుంది. మెత్తగా ఉండటంతో పిల్లాడు అదేదో తినే వస్తువును అనుకుని వెంటనే నోట్లో పెట్టుకుని పరపరా నమిలేశాడు. దీంతో పాము సెకన్లలో చనిపోయింది. అదే సమయానికి అటుగా వచ్చిన పిల్లాడి అమ్మమ్మ మాతేశ్వరీ దేవి .. పిల్లాడి చేతిలో పామును చూసి హుతాశురాలైంది. వెంటనే పిల్లాడిని, పామును వేరుచేసింది. అయితే పిల్లాడు నీరసించిపోయి తర్వాత స్పృహకోల్పోయాడు.
విషయం తెలుసుకుని పరుగున వచ్చిన పిల్లాడి తల్లి, కుటుంబసభ్యులు వెంటనే పిల్లాడిని దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేరి్పంచారు. అయితే పిల్లాడి పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే బేఠియా పట్టణంలోని ప్రభుత్వ వైద్య బోధనాస్పత్రికి తరలించారు. హుటాహుటిన పిల్లాడికి అత్యయిక వైద్యం మొదలెట్టి పిల్లాడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడు.