బంపరాఫర్‌.. ఆ కంపెనీలో వారానికి 3 రోజులే పని..! | Sakshi
Sakshi News home page

బంపరాఫర్‌.. ఆ కంపెనీలో వారానికి 3 రోజులే పని..!

Published Thu, Oct 14 2021 7:11 AM

Bengaluru Startup Slice Company Implements 3 Days Weekend - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘త్రీ డే వీక్‌’పని విధానం.. వినడానికి కొత్తగా ఉంది కదూ. అదేనండీ.. వారానికి మూడు రోజులు పనిచేస్తే చాలు. అదీ కూడా ఆఫీసుకు వస్తే రావొచ్చు లేదా ఎక్కడి నుంచైనా పనిచేయొచ్చు. వారానికి 20 నుంచి 25 గంటల వర్కింగ్‌ అవర్స్‌. ఇది వినడానికే ఎంతో బావుంది కదూ. మనకూ ఇలాంటి జాబ్‌ దొరికితే చాలు.. ఇంకా ఏమీ అవసరం లేదనే భావన అందరిలో ఏర్పడటం సహజమే. అయితే ఇవన్నీ కూడా వినడానికే కాదు ఆచరణలో అమలు చేస్తోంది బెంగళూరుకు చెందిన ఫైనాన్సియల్‌ టెక్నాలజీ స్టార్టప్‌ కంపెనీ (ఫిన్‌ టెక్‌ కంపెనీ) ‘స్లైస్‌ ’.

ఇండియన్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఛాలెంజర్‌ స్టార్టప్‌గా ‘కోడ్‌ ఇన్‌ 3’ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ సంస్థ దీనిని ప్రారంభించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి వారంలో మూడు రోజుల పనికి 80 శాతం జీతం ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. తాము చేపడుతున్న పెద్ద ప్రాజెక్ట్‌ల కోసం ఫుల్‌టైమ్‌ ఇంజనీర్లు, ప్రొడక్ట్‌ మేనేజర్లు, డిజైనర్లను రిక్రూట్‌ చేస్తోంది. ‘కొత్తగా ఆలోచించడం, నవీన ఆవిష్కరణలపై జిజ్ఞాస పెంచేం దుకు మా ప్రాజెక్ట్‌లో పనిచేసే టీమ్‌ సభ్యులకు వారు కోరుకున్న, అనువైన పని విధానాన్ని అమలు చేస్తున్నాం. వారికి ఇష్టమైన ప్రాజెక్ట్‌లపై పనిచేసే అవకాశం కలి్పంచడం, నచి్చనంత సమయం పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయి’అని 28 ఏళ్ల స్లైస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో రాజన్‌ బజాజ్‌ చెబుతున్నారు. 

కొన్ని స్టార్టప్‌ కంపెనీలు వృత్తినిపుణులు, ఉద్యోగులను కాపాడుకోవడం కోసం, తగిన నైపుణ్యాలున్న వారిని ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లు ఇస్తున్నాయి. సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘మీషో’సంస్థ తమ ఉద్యోగులకు వచ్చే నెల నవంబర్‌లో 10 రోజుల సెలవులు ప్రకటించింది. ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ కంపెనీ భారత్‌పే తమ ఉద్యోగులకు బీఎండబ్ల్యూ బైక్‌లు, ఎల్రక్టానిక్‌ గ్యాడ్జెట్లు, దుబాయ్‌లో క్రికెట్‌ హాలిడే వంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది. 

వృత్తినిపుణులకు పెరిగిన డిమాండ్‌తో... 
భారత్‌లో సాంకేతిక, వృత్తి నిపుణులకు వివిధ రం గాల్లో బాగా డిమాండ్‌ ఉంది. అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు అనేక దేశీయ టెక్‌ స్టార్టప్‌ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు వివిధ ప్రాజెక్ట్‌ల కోసం పెద్ద ఎత్తున నియామకాలు చేసుకుంటున్నాయి. దీంతో పాటు ఐటీ ఔట్‌సోర్సింగ్, సిలికాన్‌ వ్యాలీ కంపెనీలు, గ్లోబల్‌ రిటైల్‌ సంస్థలు, వాల్‌స్ట్రీట్‌ బ్యాంక్‌ల టెక్నాలజీ సెంటర్లు భారీగా వృత్తినిపుణులను చేర్చుకుంటుండటంతో నిపుణుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నాయి. ఇతర కంపెనీల కంటే ఎక్కువ సెలవులు, ఇళ్లల్లో పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు స్త్రీలతో సమానంగా మగవారికి కూడా ‘పేరెంటల్‌ లీవ్స్‌’, వృత్తిçపరంగా మరిన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు.. ఇలా అనేక అవకాశాలు కలి్పస్తున్నాయి. 

పనివిధానాన్ని మార్చేసిన మహమ్మారి... 
కోవిడ్‌ మొదటి, రెండోవేవ్‌లు ప్రపంచాన్ని కుదిపేసాక కంపెనీలన్నీ కొన్నాళ్లు వర్క్‌ఫ్రంహోం, తర్వాత కొన్నిరోజులు ఆఫీసు, కొన్నిరోజులు ఇంటి నుంచి పనిచేయడం, ఇతర రూపాల్లో ‘హైబ్రిడ్‌ వర్కింగ్‌’విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వ, ఐటీ ఉద్యోగులకు 5రోజుల పని విధానం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. విదేశాల్లో కొన్ని సంస్థలు ‘ఫోర్‌ డే వీక్‌ వర్క్‌’విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేశాయి. అయితే, యూకేతో సహా పలు దేశాల్లో ఈ విధానం పెద్దగా విజయవంతం కాలేదు. ఇన్ని రోజులు, ఇన్ని గంటలు పనిచేయాలనడం కంటే.. తమకు సరిపోయే పనిగంటలు, నచి్చన విధానంలో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించొచ్చుననే అభిప్రాయం వ్యక్తమైంది.

ఇకపై హైబ్రిడ్‌ పద్ధతే... 
భవిష్యత్‌లో త్రీ డే, ఫోర్‌ డే వీక్‌ లేదా ఇళ్లు, ఆఫీసు, మరెక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా పనిచేసే హైబ్రిడ్‌ పద్ధతికి దాదాపుగా అన్ని కంపెనీలు మారాల్సిందే. ఐటీలో ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూర్, ముంబై వంటి మెట్రో నగరాల్లో దీంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వాహనాల రద్దీతోపాటు కాలుష్యం తగ్గుతుంది. మెంటల్‌ స్ట్రెస్‌ తగ్గి జీవనశైలి మెరుగవుతుంది. ఐతే ఫార్మా, ప్రొడక్షన్‌ ఇతర రంగాల్లో ఇలాంటి విధానాలు సాధ్యం కావు.     –డా. బి. అపర్ణరెడ్డి, హెచ్‌ఆర్‌ నిపుణురాలు  

Advertisement
 
Advertisement