
శివాజీనగర: బెంగళూరు-బెళగావి మధ్య వందే భారత్ రైలు, మెట్రో ఎల్లో మార్గం ప్రారంభం, మెట్రో 3వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొంటారు. ప్రధాని పర్యటన కోసం సిలికాన్ సిటీలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మేఖ్రి సర్కిల్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో వస్తారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11.40కి మెజెస్టిక్‌లోని సంగొళ్లి రాయణ్ణ రైల్వేస్టేషన్‌కు చేరుకొని బెంగళూరు– బెళగావి మధ్య వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపుతారు. అలాగే అమృత్‌సర్– శ్రీమాతా వైష్ణోదేవి కట్రా రైల్వే స్టేషన్, నాగపూర్–పూణె మధ్య వందేభారత్ రైలు సేవలను ప్రారంభిస్తారు. ఆ తరువాత ఆర్‌వీ రోడ్డు రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు చేరుకొని మెట్రో ఎల్లో మార్గం ప్రారంభించి మెట్రో రైలులో ఎల్రక్టానిక్ సిటీ వరకు ప్రయాణిస్తారు.
ఎల్రక్టానిక్ సిటీలో ఐఐఐటీ సభా మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెట్రో 3వ దశకు శంకుస్థాపన నెరవేర్చి ప్రసంగిస్తారు. తరువాత పర్యటన ముగించి ఢిల్లీకి బయల్దేరుతారు. ప్రధాని టూర్‌తో నగరంలో పలు రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు.
బెంగళూరు-బెళగావి వందే భారత్ రైలు సంచారంతో కళ్యాణ కర్ణాటకకు రవాణా వసతి మరింత మెరుగుపడుతుంది. ఈ రైలు బుధవారం తప్ప వారంలో అన్ని రోజులు సంచరిస్తుంది. రోజూ ఉదయం 5.20కి బెళగావిలో బయలుదేరి మధ్యాహ్నం 1.50కి బెంగళూరు రాయణ్ణ రైల్వే స్టేషన్‌కు చేరుకొంటుంది. మధ్యాహ్నం 2.20కి రాయణ్ణ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి బెళగావికి రాత్రికి 10.40కి బెళగావి చేరుకొంటుంది. యశ్వంతపుర, తుమకూరు, దావణగెరె, హావేరి, హుబ్లీ–ధారవాడ స్టేషన్‌లలో నిలుస్తుంది. ప్రధాని పర్యటనల్లో రాష్ట్ర, కేంద్ర మంత్రులు పాల్గొంటారు.