ప్రశాంతంగా పూజలు.. నమాజ్‌  | Basant Panchami prayers, Friday namaz held peacefully in MP Dhar | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పూజలు.. నమాజ్‌ 

Jan 24 2026 6:23 AM | Updated on Jan 24 2026 6:23 AM

Basant Panchami prayers, Friday namaz held peacefully in MP Dhar

భోజ్‌శాల సముదాయంలో గట్టి బందోబస్తు

ధార్‌: మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఉన్న భోజ్‌శాల–కమాల్‌ మౌలా మసీదు సముదాయంలో శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ ప్రాంగణంలోని ఒక ప్రాంతంలో హిందువులు వసంత పంచమిని పురస్కరించుకుని పూజలు నిర్వహించగా, ముస్లిం మరోచోట నమాజ్‌ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం నుంచి హిందువులు పూజలు మొదలుపెట్టారు. 

సాయంత్రం వరకు పూజలు కొనసాగాయి. మధ్యలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేశారు. నగర వ్యాప్తంగా 8 వేల మంది పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. భోజ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులు నిర్దేశించిన ప్రాంతంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ సరస్వతీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించి, అఖండ పూజను ప్రారంభించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగలేదని, ప్రశాంత వాతావరణానికి భంగం కలగలేదని జిల్లా మేజిస్ట్రేట్‌ ప్రియాంక్‌ మిశ్రా తెలిపారు.

 నగరంలోని ప్రతి వీధిలోనూ బందోబస్తుతోపాటు సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని ఎస్‌పీ మయాంక్‌ అవస్థి చెప్పారు. సామాజిక మాధ్యమ వేదికలపైనా ఓ కన్నేసి ఉంచామన్నారు. 11వ శతాబ్దం నాటి ఈ కట్టడాన్ని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) పరిరక్షిస్తోంది. 2003లో ఏఎస్‌ఐ ఇచి్చన ఆదేశాల ప్రకారం భోజ్‌శాలలో ప్రతి మంగళవారం హిందువులు పూజలు, ముస్లిం ప్రతి శుక్రవారం నమాజ్‌ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, వసంత పంచమి శుక్రవారం రోజే రావడంతో గురువారం ఇరువర్గాలకు అనుకూలంగా ఉండేలా పూజలు, నమాజ్‌ చేసుకునేందుకు ఏర్పా ట్లు చేయాలని ఆదేశించడం తెల్సిందే. 

భవ్య సరస్వతీ ఆలయం నిర్మిస్తాం: వీహెచ్‌పీ 
వివాదాస్పద భోజ్‌శాల సముదాయంలో బ్రహా్మండమైన సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ప్రకటించింది. చట్ట పరమైన ప్రక్రియను పూర్తి చేసుకున్నాక 2034కల్లా ఆలయ నిర్మాణ కలను సాకారం చేస్తామని తెలిపింది. ప్రస్తుతం లండన్‌ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి మాత విగ్రహాన్ని తిరిగి తీసుకువచి్చ, ఆ ఆలయంలో ప్రతిíÙ్ఠస్తామని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ తెలిపారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించిన ఆలయం మాదిరిగానే ఇది కూడా ఉంటుందన్నారు. 

శుక్రవారం ఆయన భోజ్‌శాలలో జరిగిన సరస్వతీమాత పూజకు హాజరైన భక్తులనుద్దేశించి మాట్లాడారు. ‘భోజ్‌శాలలో వాగ్దేవి ఆలయం 1034లో నిర్మితమైంది. ఆలయ ప్రతిష్ట జరిగి ఇప్పటికి 992 ఏళ్లు పూర్తయ్యాయి. 2034కల్లా వెయ్యేళ్లు అవుతాయి. అప్పటి కల్లా చట్టపరమైన అడ్డంకులను అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి. అయోధ్య రామాలయం మాదిరిగా భవ్య సరస్వతీ మాత ఆలయాన్ని నిర్మించుకోవాలి’అని అలోక్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. లండన్‌ నుంచి వాగ్దేవి విగ్రహాన్ని భారత్‌కు తిరిగి తేవాలని ఈ సందర్భంగా పలువురు సాధుసంతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉజ్జయినిలోని శ్రీ మహాకాల్‌ లోక్‌ కారిడార్‌ మాదిరిగానే వాగ్దేవి కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement