
100 ఫోన్లు పోతే 25 మాత్రమే దొరుకుతున్నాయి
ఢిల్లీలో అత్యల్పంగా రికవరీ రేటు కేవలం 1.87%
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటుకంటే నయమే
వేలు కాదు.. లక్షలు పోసి ఫోన్ కొంటున్నాం. ఎడాపెడా వాడేస్తున్నాం. అంతేనా? అన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేస్తాం. డేటాని బ్యాకప్ పెట్టేస్తున్నాం. కానీ, అనుకోకుండా ఫోన్ పోతే? ఏముందీ.. రికవర్ చేసేయొచ్చులే అనుకుంటే మీది ఓవర్ కాన్ఫిడెన్సే. ఎందుకంటే.. పోయిన ఫోన్ల రికవరీ రేట్ మీరు అనుకునేంత స్థాయిలో లేదు. దేశ రాజధాని ఢిల్లీనే అందుకు సాక్ష్యం. అక్కడ పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ రేటు ఎంతో తెలుసా? 1.87%. అంటే.. వంద ఫోన్లు పోతే.. ఒకటో రెండో రికవర్ చేస్తున్నారట. దేశ రాజధానిలో పరిస్థితి సరే, మరి మన దగ్గర ఎలా ఉంది?
– సాక్షి, స్పెషల్ డెస్క్
ఫోన్ పోగానే ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాం. ట్రాక్ చేస్తారులే అని భరోసాతో ఎదురు చూస్తాం. కానీ, పోయిన ఫోన్లు దొరికే అవకాశం చాలా తక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో సగటున 100 ఫోన్లు పోతే 25 ఫోన్లనే తిరిగి తీసుకురాగలుగుతున్నారట. టెలికమ్యూనికేషన్ల శాఖకు చెందిన సంచార్ సాథీ పోర్టల్ చెబుతున్న వాస్తవాలివి. ఢిల్లీలో మొత్తంగా 8.22 లక్షలకు పైగా ఫోన్లను బ్లాక్ చేశారు. కానీ, వాటిలో తిరిగి దొరికినవి కేవలం 9,871 మాత్రమే. ఈ తక్కువ రికవరీ జాబితాలో పంజాబ్, బిహార్ ఉన్నాయి.
జాతీయ స్థాయిలో 36.35 లక్షలకుపైగా ఫోన్లను బ్లాక్ చేస్తే.. ట్రేస్ చేసినవి 22.14 లక్షలు. రికవరీ చేసినవి 5.45 లక్షలు. రికవరీ రేటు 24.5 శాతం. అంటే 100లో 25 ఫోన్లు మాత్రమే రికవరీ అవుతున్నాయన్నమాట. ఈ గణాంకాల విషయంలో యూజర్లు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఎందుకీ అలసత్వం అంటూ సోషల్ మీడియా వేదికలపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మన పరిస్థితేంటి?
తెలంగాణలో 3.76 లక్షల ఫోన్లు బ్లాక్ చేస్తే.. ట్రేస్ చేసినవి 2.13 లక్షలు. వాటిలో 91,306 ఫోన్లు రికవరీ అయ్యాయి. అంటే, రికవరీ రేటు 42.8%. ఆంధ్రప్రదేశ్‌లో 1.26 ఫోన్లు బ్లాక్ చేస్తే.. 79వేలకుపైగా ట్రేస్ చేయగలిగారు. తిరిగి తీసుకొచ్చినవి 31,478. రికవరీ రేటు 39.66% శాతం. మరోవైపు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. రికవరీ ఫోన్లను పోలీసులు రాబట్టే క్రమంలో కొందరు అమాయకులు బయటపడుతున్నారు. ఎవరా అమాయకులు అంటే.. దొంగిలించిన ఫోన్ ని కొన్నవాళ్లు. చాలా తక్కువ ధరకే దొరుకుతుందని ఆన్ లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో అనధికారికంగా ఇలాంటి ఫోన్లు కొంటున్నారు.
పోలీస్ స్టేషన్లకు పార్సిళ్లు
పోలీసు స్టేషన్లు అంటే ఫిర్యాదులు, విచారణలు, కేసులు. కానీ, కొన్ని స్టేషన్లకు ఇటీవల విచిత్రమైన పార్సిళ్లు వస్తున్నాయి. అవేంటో తెలుసా..దొంగిలించిన మొబైల్ ఫోన్లు. వాటిని కొనుక్కున్న కొత్త యజమానులు వాటిని తిరిగి పోగొట్టుకున్న వారికి పంపేందుకు పోలీస్ స్టేషన్లకు కొరియర్ చేస్తున్నారట. అంతలా స్వచ్ఛందంగా ఎందుకు పంపుతున్నారనేగా మీ సందేహం? ఎందుకంటే.. ఈ చిత్రమైన ట్రెండ్ వెనుక ఒక కొత్త టెక్నాలజీ ఉంది. దానిపేరే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్).
ఫోన్ల దొంగతనాల్ని కట్టడి చేసేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఫోన్ పోగొట్టుకున్నవారు ఐఎంఈఐ నంబర్ సాయంతో.. ఈ పోర్టల్ ద్వారా ఆ ఫోన్‌ని బ్లాక్ చేయొచ్చు. దీంతో ఆ ఫోన్ దేశంలో ఎక్కడున్నా.. ఏ నెట్‌వర్క్‌పైనా పనిచేయకుండా పోతుంది. అంటే అది దొంగల చేతిలో ఉన్నా పనికిరాదన్నమాట. అందుకే అలాంటి ఫోన్లు పోలీస్ స్టేషన్లకు పార్సిళ్లుగా వెళ్తున్నాయి.
స్వచ్ఛందంగా డిస్‌కనెక్ట్
కావాల్సిన ప్రూఫ్‌లతో విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకుని వాడేసిన రోజులు దాటుకుని.. నా పేరు మీద ఏదైనా నంబర్లు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయా? అని మనమే వెతుక్కునే రోజులకి వచ్చాం. అందుకు కారణం లేకపోలేదు. ఫేక్ ప్రూఫ్‌లు, దొంగిలించిన సిమ్‌లతో సైబర్ క్రై మ్‌లకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్లు స్వచ్ఛందంగానే వారి పేరు, అడ్రస్ ప్రూఫ్‌తో ఉన్న ఫోన్ నంబర్లను వెతికి ‘సంచార్ సాథీ’ పోర్టల్ ద్వారా బ్లాక్ / డిస్‌కనెక్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1.07 కోట్లు.
