
ఓట్ల చౌర్యానికి పాల్పడుతున్న అధికారులు శిక్ష అనుభవించాల్సిందే
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసీ) తీరుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఈసీ ఓట్ల చౌర్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఓట్ల చోరీని నిరూపించడానికి తమ వద్ద అణు బాంబు లాంటి సాక్ష్యం ఉందని స్పష్టంచేశారు. ఈ అణు బాంబు పేలితే దాక్కోవడానికి ఈసీకి దేశంలో ఎక్కడా చోటు దొరకదని అన్నారు. ఓట్ల చౌర్యానికి పాల్పడుతున్న అధికారులు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.
రాహుల్ గాంధీ శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఓట్ల చౌర్యంపై తమ వద్ద 100 శాతం సాక్ష్యం ఉందన్నారు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐర్) పూర్తయ్యి ముసాయిదా జాబితాను విడుదల చేసిన రోజే ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపణలు గుప్పించడం గమనార్హం. కొందరి ఓట్లు తొలగించడం, కొత్తగా ఓటర్లను చేరి్పంచడం సాధారణ విషయం కాదని ఆయన పేర్కొన్నారు.
బీజేపీ కోసమే ఈ తతంగం సాగుతోందన్నారు. 2023లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, గత ఏడాది జరిగిన లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో ఓట్ల చౌర్యం జరిగిందన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరిట ఎన్నికల ముందు కొత్తగా కోట్లాది మంది ఓటర్లను జాబితాలో చేర్చారని పేర్కొన్నారు.
దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరితే ఎన్నికల సంఘం స్పందించలేదని విమర్శించారు. అందుకే తామే సొంతంగా ఆరు నెలలపాటు పరిశోధన చేశామని, అణు బాంబు లాంటి సాక్ష్యం లభించిందని వ్యాఖ్యానించారు. ఓట్లను దొంగతనం చేయడం దేశ ద్రోహం కంటే తక్కువేమీ కాదన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు పదవీ విరమణ చేసి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటామని తేల్చిచెప్పారు. దేశానికి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తులకు శిక్ష తప్పదన్నారు.
రాహుల్ ఆరోపణలు పట్టించుకోవద్దు
ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వరుస ప్రకటనలపై ఎన్నికల సంఘం శుక్రవారం స్పందించింది. బాధ్యతారహితమైన, నిరాధార ఆరోపణలు పట్టించుకోవద్దని.. పారదర్శకంగా, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని తమ అధికారులకు సూచించింది. ఓట్ల చౌర్యం అంటూ ప్రతిరోజూ వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేలి్చచెప్పింది. ఆరోపణల గురించి పట్టించుకోకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని ఈసీ పేర్కొంది. దేశంలో ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు స్పష్టంచేసింది.