
గువాహటి: అసోంలోని 18 ఏళ్లు పైబడిన వారికి మొట్టమొదటి ఆధార్ కార్డుల జారీని అక్టోబర్ నుంచి నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో ఉంటున్న అక్రమ వలసదారులు భారత పౌరసత్వం పొందకుండా అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన గురువారం ప్రకటించారు.
అయితే, ఇప్పటి వరకు ఆధార్ పొందని 18 ఏళ్లు పైబడిన వారికి నెల గడువు ఇస్తున్నామని, ఈలోగా వారు దరఖాస్తు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఎస్‌సీ, ఎస్‌టీలకు మాత్రం మరో ఏడాది వరకు ఆధార్ జారీ చేస్తారని వివరించారు. గత ఏడాది కాలంగా బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి గుర్తించి, వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు మతం వంటి ప్రాతిపదికలేవీ లేవని స్పష్టం చేశారు. ఇక, ఆధార్ నమోదుకు ఎటువంటి వయో పరిమితి లేదని, అప్పుడే పుట్టిన శిశువుకు సైతం ఆధార్ నమోదు చేయించవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) స్పష్టం చేసింది.