బిభవ్‌ కుమార్‌ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

బిభవ్‌ కుమార్‌ అరెస్ట్‌

Published Sun, May 19 2024 5:26 AM

Arvind Kejriwal Aide Bibhav Kumar Arrested In Swati Maliwal Assault Case

మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం

అవినీతి కేసులో ఇరుక్కోవడంతో బీజేపీకి ఆమె వంతపాడుతున్నారు

మలివాల్‌పై ఆప్‌ ఆరోపణ

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆప్‌ రాజ్యసభ సభ్యు రాలు స్వాతి మలివాల్‌పై దాడి ఆరోపణ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు, కేజ్రీ వాల్‌ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌చేశారు. శనివారం కేజ్రీవాల్‌ ఇంటికి బిభవ్‌ వచ్చాడని తెల్సుకుని ఢిల్లీ పోలీసులు అక్కడికి వెళ్లారు. బిభవ్‌ను ప్రశ్నించే నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్ట్‌చేసినట్లు తర్వాత ప్రకటించారు. 

సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు వెళ్లిన సందర్భంగా బిభవ్‌ విచక్షణరహితంగా, నెలసరి బాధ ఉందని చెప్పినా వినకుండా చెంపలు చెళ్లుమనిపించి, ఛాతి, పొట్ట, పొత్తికడుపుపై పలుమార్లు తన్నాడని బిభవ్‌పై మలివాల్‌ ఫిర్యాదు చేయడం తెల్సిందే. శుక్రవారం ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేయడం గమనార్హం. కోర్టు ఎదుట బిభవ్‌ను హాజరుపరిచి దర్యాప్తు నిమిత్తం తమ కస్టడీకి కోరతామని సీనియర్‌ పోలీసు అధికారి చెప్పారు. ఆరోజు ఘటనాస్థలిలో ఉన్న 10 మంది నుంచి స్టేట్‌మెంట్లు నమోదుచేశామని వెల్లడించారు. 

బిభవ్‌ ఫిర్యాదును పట్టించుకోండి: అతిశి
ఢిల్లీ పోలీసులు ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భావిస్తే మలివాల్‌పై బిభవ్‌ ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోద ుచేయాలని ఆప్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిశి శనివారం డిమాండ్‌చేశారు. పత్రకాసమావేశంలో అతిశి సుదీర్ఘంగా మాట్లాడారు.  ‘‘ఏసీబీ నమోదుచేసిన ఒక అక్రమ నియామకాల కేసులో మలివాల్‌ ఇరుక్కున్నారు. అరెస్ట్‌ నుంచి తప్పించాలంటే కేజ్రీవాల్‌ను కేసులో ఇరికించాలని ఆమెను బీజేపీ బ్లాక్‌మెయిల్‌ చేసింది. బీజేపీ చేసిన ఈ కుట్రలో మలివాల్‌ ఒక పావు మాత్రమే. 

అపాయింట్‌మెంట్‌ లేకుండా సీఎం ఇంటికి ఆమె ఎందుకొచ్చినట్లు? ఒకవేళ సీఎంను కలిసి ఉంటే వాళ్ల ప్లాన్‌ ప్రకారం బిభవ్‌తో గొడవ, అరెస్ట్‌ జరిగేవి కాదు. బీజేపీకి ఒక విధానం ఉంది. మొదట కేసులు పెడతారు. తర్వాత బెదిరించి వినకపోతే జైల్లో పెడతారు. సీఎం ఆఫీస్‌లో డ్యూటీలో ఉన్న భద్రతా అధికారిపై మలివాల్‌ దుర్భాషలాడి గొడవ పడ్డారు. అనుమతిలేకుండా లోపలికి వచ్చారు. ఈ ఉల్లంఘన అంశాలపై ఢిల్లీ పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయట్లేరు? ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని పోలీసులు కోర్టుకు ఇవ్వరట. నిందితుడి లాయర్‌కు ఇవ్వరట. కానీ రెండ్రోజులుగా మీడియాలో అది చక్కర్లు కొడుతోంది. ఈ కుట్ర ఎంతపెద్ద స్థాయిలో జరిగిందో ఇట్టే అర్థమవుతోంది ’’ అని మోదీ సర్కార్‌పై అతిశి ఆరోపణలు గుప్పించారు.  

మరో వీడియో విడుదల
ఘటన జరిగిన రోజునాటి సీసీటీవీ ఫుటేజీ మరొకటి బయటికొచ్చింది. ఆ వీడియోలో కేజ్రీవాల్‌ భద్రతా సిబ్బంది మలివాల్‌ను చేయిపట్టుకుని ఇంటి బయటకు బలవంతంగా తీసుకొచ్చారు. మహిళా సెక్యూరిటీ గార్డ్‌ చేతిని మలివాల్‌ విదిలించుకుని దూరం జరిగి, అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు ఆ వీడియోలో రికార్డయింది. అయితే ‘‘మలివాల్‌ ఆరోపించినట్లు ఆమె నడవలేకపోతున్నట్లు వీడియోలో లేదు. మామూలుగానే నడుస్తున్నారు. మహిళా పోలీస్‌ అధికారిని నెట్టిపడేశారు.

 షర్ట్‌ చిరిగిందని, బటన్స్‌ ఊడిపోయాయని చెప్పిందంతా అబద్ధమని ఈ వీడియోలో తేలిపోయింది’’ అని అతిశి ఆరోపించా. అయితే పూర్తి నిడివి ఫుటేజీ విడుదలచేయకుండా కత్తిరించి అతికించిన ఎడిటెడ్‌ వీడియోను విడుదలచేసి ఆప్‌ మలివాల్‌ వ్యక్తిత్వహననానికి పాల్పడుతోందని ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ తీవ్రంగా తప్పుబట్టారు. బిభవ్‌ అరెస్ట్‌తో ఆప్‌ చెత్త చరిత్ర పేజీలు ఇప్పుడు బయటికొస్తాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో మలివాల్‌కు చేసిన వైద్యపరీక్షల వివరాలు బహిర్గతమయ్యాయి. మెడికో లీగల్‌ సర్టిఫికెట్‌ ప్రకారం మలివాల్‌ ఎడమ కాలు బొటనవేలు సమీపంలో, కుడి చెంపపై గాయాలున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement