పాట్నా: బిహార్‌లో మంగళవారం చివరి దశ ఎన్నికలు జరగనున్న వేళ న్యూఢిల్లీలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ నెల 6న 121 నియోజకవర్గాలకు తొలిదశ ఎన్నికలు జరగ్గా.. మంగళవారం 122 నియోజకవర్గాలకు పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోటకు 500 మీటర్ల దూరంలో ఉన్న మెట్రోస్టేషన్ వద్ద బాంబు పేలుడు ఘటన యంత్రాంగాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.
తొలి దశ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు విజయంపై వేటికవే ధీమా వ్యక్తం చేయగా.. రెండో దశ గెలుపోటములను శాసించనుంది. ఈ క్రమంలో దేశ రాజధానిలో జరిగిన బాంబు పేలుడు ఘటన ఎన్నికలపై ప్రభావం చూపించే సూచనలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బిహార్‌లోనే ఉన్నారు. దేశ రాజధానిలో బాంబు పేలుడు వార్త తెలియగానే.. ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీలో బాంబు పేలుడు, బిహార్‌లో ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సరిహద్దుల్లో నిఘాను పెంచగా.. తాజా ఘటనతో యూపీలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు.


