కోర్టుల్లో 40% లాయర్లు ఫేక్‌! | 40% of Lawyers In India Hold Fake Degrees! BCI Chairman Manan Mishra Reveals | Sakshi
Sakshi News home page

కోర్టుల్లో 40% లాయర్లు ఫేక్‌!

May 24 2026 7:49 AM | Updated on May 24 2026 11:14 AM

40% of Lawyers In India Hold Fake Degrees! BCI Chairman Manan Mishra Reveals

    బీసీఐ చైర్మన్‌ మన్నన్‌ కుమార్‌ మిశ్రా సంచలన ప్రకటన

    నకిలీ లా డిగ్రీలతో ప్రాక్టీస్‌ చేస్తున్నారని ఆరోపణ

    సీజేఐ ‘బొద్దింకల’వ్యాఖ్యలకు అర్థం ఇదేనని స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ న్యాయ స్థానాల్లో ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదుల్లో 40 శాతం మంది వరకు నకిలీలేనని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) చైర్మన్, సీనియర్‌ న్యాయవాది మన్నన్‌ కుమార్‌ మిశ్రా సంచలన విషయాన్ని వెల్లడించారు. కొందరు నకిలీ లా డిగ్రీలు సృష్టించి, నల్ల కోట్లు ధరించి కోర్టుల్లో దర్జాగా వాదనలు వినిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దష్టికి తీసుకువెళ్లామని మిశ్రా తెలిపారు. 

నకిలీల వ్యవహారంపై బీసీఐకి స్పష్టమైన అవగాహన ఉందని మిశ్రా పేర్కొన్నారు. ‘కోర్టు ప్రాంగణాల్లో నల్ల కోట్లు, బ్యాండ్‌లతో తిరుగుతున్న వారిలో 35–40 శాతం మంది నకిలీ న్యాయవాదులేనని బీసీఐకి తెలుసు. వారి డిగ్రీలు పూర్తిగా నకిలీవి. వాటిని ఎక్కడో కొనుగోలు చేసి లేదా సృష్టించి, ఆ ఆధారంతో కోర్టుల్లో వాదనలు చేస్తున్నారు‘అని ఓ ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. లాయర్ల డిగ్రీలను ధ్రువీకరించేందుకు బీసీఐ గతంలో ఒక ప్రక్రియను ప్రారంభించింది. ఆ సమయంలో 40 శాతం మంది న్యాయ వాదులు తమ వెరిఫికేషన్‌ ఫారాలను పూర్తి చేయలేదని మిశ్రా పేర్కొన్నారు. ధ్రువీ కరణలు సమర్పించని వారినే నకిలీలుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు.

సీజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో.. 
ఇటీవల సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదు ల హోదాకు సంబంధించిన ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా కొందరు లాయర్ల డిగ్రీల వాస్తవికతపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బీసీఐ చర్యలు తీసుకుంటుందని తాను ఆశించడం లేదని, డిగ్రీల వెరిఫికేషన్‌ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని ఆలోచిస్తున్నట్లు సీజేఐ వ్యాఖ్యానించారు. అదే సమయంలో యాక్టివిజం ముసుగులో కొందరు నిరుద్యోగ యువకులు వ్యవస్థలపై బొద్దింకల (కాక్రోచ్‌ల) వలె దాడి చేస్తున్నారని తీవ్ర పదజాలం వాడారు. 

తీవ్ర దుమారం రేగడంతో నకిలీ డిగ్రీలు ఉన్న వారిని ఉద్దేశించే తానలా అన్నట్లు సీజేఐ అనంతరం వివరణ ఇచ్చారు. సీజేఐ వ్యాఖ్యల అనంతరం సోషల్‌ మీడియాలో ’కాక్రోచ్‌ జనతా పార్టీ’పేరుతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మిశ్రా పైవివరాలను వెల్లడించారు. నకిలీ డిగ్రీలు పొంది న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతను ఉద్దేశించే సీజేఐ ఆ వ్యాఖ్యలు చేశారంటూ మిశ్రా సమర్థించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement