Manan Kumar Mishra
-
కోర్టుల్లో 40% లాయర్లు ఫేక్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ న్యాయ స్థానాల్లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల్లో 40 శాతం మంది వరకు నకిలీలేనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్, సీనియర్ న్యాయవాది మన్నన్ కుమార్ మిశ్రా సంచలన విషయాన్ని వెల్లడించారు. కొందరు నకిలీ లా డిగ్రీలు సృష్టించి, నల్ల కోట్లు ధరించి కోర్టుల్లో దర్జాగా వాదనలు వినిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ వ్యవహారాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దష్టికి తీసుకువెళ్లామని మిశ్రా తెలిపారు. నకిలీల వ్యవహారంపై బీసీఐకి స్పష్టమైన అవగాహన ఉందని మిశ్రా పేర్కొన్నారు. ‘కోర్టు ప్రాంగణాల్లో నల్ల కోట్లు, బ్యాండ్లతో తిరుగుతున్న వారిలో 35–40 శాతం మంది నకిలీ న్యాయవాదులేనని బీసీఐకి తెలుసు. వారి డిగ్రీలు పూర్తిగా నకిలీవి. వాటిని ఎక్కడో కొనుగోలు చేసి లేదా సృష్టించి, ఆ ఆధారంతో కోర్టుల్లో వాదనలు చేస్తున్నారు‘అని ఓ ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. లాయర్ల డిగ్రీలను ధ్రువీకరించేందుకు బీసీఐ గతంలో ఒక ప్రక్రియను ప్రారంభించింది. ఆ సమయంలో 40 శాతం మంది న్యాయ వాదులు తమ వెరిఫికేషన్ ఫారాలను పూర్తి చేయలేదని మిశ్రా పేర్కొన్నారు. ధ్రువీ కరణలు సమర్పించని వారినే నకిలీలుగా అనుమానిస్తున్నట్లు చెప్పారు.సీజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఇటీవల సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదు ల హోదాకు సంబంధించిన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా కొందరు లాయర్ల డిగ్రీల వాస్తవికతపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బీసీఐ చర్యలు తీసుకుంటుందని తాను ఆశించడం లేదని, డిగ్రీల వెరిఫికేషన్ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని ఆలోచిస్తున్నట్లు సీజేఐ వ్యాఖ్యానించారు. అదే సమయంలో యాక్టివిజం ముసుగులో కొందరు నిరుద్యోగ యువకులు వ్యవస్థలపై బొద్దింకల (కాక్రోచ్ల) వలె దాడి చేస్తున్నారని తీవ్ర పదజాలం వాడారు. తీవ్ర దుమారం రేగడంతో నకిలీ డిగ్రీలు ఉన్న వారిని ఉద్దేశించే తానలా అన్నట్లు సీజేఐ అనంతరం వివరణ ఇచ్చారు. సీజేఐ వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో ’కాక్రోచ్ జనతా పార్టీ’పేరుతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మిశ్రా పైవివరాలను వెల్లడించారు. నకిలీ డిగ్రీలు పొంది న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతను ఉద్దేశించే సీజేఐ ఆ వ్యాఖ్యలు చేశారంటూ మిశ్రా సమర్థించారు. -
నేడు లాయర్ల దేశవ్యాప్త నిరసనలు
న్యూఢిల్లీ: న్యాయవాదులు సమ్మెలు, నిరసనలు చేపట్టకుండా నియంత్రించేలా తీసుకురావాలని ప్రతిపాదించిన ఓ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లాయర్లందరూ శుక్రవారం విధులకు గైర్హాజరై నిరసనలు చేపట్టనున్నారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న లాయర్లకు పిలుపినిచ్చినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తెలిపింది. కాగా సుప్రీంకోర్టు లాయర్లు సంఘీభావం తెలుపుతూ చేతికి తెల్లని బ్యాండ్లు ధరించి విధులకు హాజరవుతారని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. నిరసనల్లో తెలుగు రాష్ట్రాల న్యాయవాదులు.. సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల స్వతంత్రతకు విఘాతం కలిగించేలా ఉన్న లా కమిషన్ సిఫారసులు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాలని ఉమ్మడి బార్ కౌన్సిల్ తెలుగు రాష్ట్రాల్లోని న్యాయవాదులకు పిలుపునిచ్చింది. శుక్రవారం అన్ని చోట్ల కోర్టు విధులకు దూరంగా ఉండాలని న్యాయవాదులను కోరింది. లా కమిషన్ సిఫారసులు న్యాయవాదుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఓ తీర్మానం చేసిందని, ఈ అంశంపై ఏప్రిల్ రెండో వారంలో సమావేశాలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని న్యాయవాదుల సంఘాలను కోరినట్లు చెప్పారు. -
మన లాయర్లలో 30 శాతం నకిలీలే!
భారతదేశంలోని లాయర్లలో 30 శాతం మంది నకిలీ పట్టాలతోనే ప్రాక్టీసు చేసేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయానా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మానన్ కుమార్ మిశ్రా తెలిపారు. బార్ కౌన్సిల్ ఏర్పాటుచేసిన ఓ మెగా లాయర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పుచేసిన లాయర్ల మీద చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉంది. దాంతో ఇలాంటి నకిలీలు అందరినీ ఏరిపారేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మిశ్రా చెప్పారు. బార్ కౌన్సిల్ అంచనా ప్రకారం 20 శాతం మంది లాయర్లు అసలు ఎలాంటి డిగ్రీలు లేకుండానే ప్రాక్టీసు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కూడా నకిలీ డిగ్రీతో దొరికిపోయిన సంగతి తెలిసిందే. నకిలీ లాయర్లతో పాటు.. న్యాయవాద డిగ్రీ చేసి కూడా ప్రాక్టీసు చేయకుండా మానేసిన వాళ్లు వృత్తిని అవమానించినట్లేనని మిశ్రా చెప్పారు. ఇక చిన్నచిన్న కారణాలకు కూడా న్యాయవాదులు సమ్మెలు చేయడం, కోర్టులను బహిష్కరించడంపై కూడా మిశ్రా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇలా న్యాయవాదులు తరచు సమ్మెలు, కోర్టు బహిష్కరణలు చేస్తున్నారని ఆయన అన్నారు.


