మణిపూర్‌లో హింసకు మరో ముగ్గురు బలి

3 killed, 4 injured in fresh violence in Manipur - Sakshi

అంబులెన్స్‌కు నిప్పుపెట్టిన అరాచక మూక

తల్లి, కుమారుడు సహా ముగ్గురు దుర్మరణం

కోల్‌కతా: నివురుగప్పిన నిప్పులా మారిన మణిపూర్‌ మరో ముగ్గురు అమాయకుల ప్రాణాలు బలితీసుకుంది. రాష్ట్రంలోని పశ్చిమ ఇంఫాల్‌ జిల్లాలో చిన్నారిని తరలిస్తున్న ఒక అంబులెన్సుకు అల్లరిమూక నిప్పుపెట్టింది. దీంతో అంబులెన్సులో ఉన్న ఎనిమిదేళ్ల బాలుడు, అతని తల్లి, మరో బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగుచూశాయి. సంబంధిత వివరాలను అధికారులు వెల్లడించారు.

కాంగ్‌చుప్‌ ప్రాంతంలోని అస్సాం రైఫిల్స్‌ బలగాల శిబిరం వద్ద మెయిటీ వర్గానికి చెందిన ఒకావిడ తన కుమారుడితో కలిసి నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం క్యాంప్‌పైకి కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో బాలుడి తలకు బుల్లెట్‌ గాయమైంది. దీంతో బాలుడిని హుటాహుటిన అంబులెన్సులో తల్లి, ఆమె బంధువు తరలిస్తున్నారు. కొంతదూరం వీరికి రక్షణగా వచ్చిన అస్సాం రైఫిల్స్‌ బలగాలు తర్వాత ఆ బాధ్యతను స్థానిక పోలీసులకు అప్పజెప్పి వెనుతిరిగారు.

కాంగ్‌పోకీ జిల్లా సరిహద్దుకు రాగానే ఐసోసెంబా ప్రాంతంలో అంబులెన్సును ఓ అల్లరిమూక అడ్డుకుని తగలబెట్టింది. దీంతో మంటల్లో చిక్కుకుని బాలుడు, అతని తల్లి, బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన ప్రాంతంలో కుకీ గిరిజనుల గ్రామాలు ఎక్కువ. మృతులు మెయిటీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజులుగా ఇరువర్గాల మధ్య హింస, ఎదురుకాల్పుల ఘటనలు జరుగుతున్నాయి.

షా ఇంటివద్ద కుకీ వర్గీయుల నిరసన
ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నివాసం వద్ద మణిపూర్‌ కుకీ వర్గీయులు నిరసనకు దిగారు. ‘కుకీల ప్రాణాలు కాపాడండి’ అంటూ నినాదాలు ఇచ్చారు. నలుగురు కుకీ ప్రతినిధులను షా ఇంట్లోకి సమావేశం కోసం అనుమతించామని మిగతా వారిని జంతర్‌మంతర్‌కు తరలించామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కుకీ, మెయిటీ వర్గాల మధ్య మొదలైన జాతి వైరం హింసాత్మకంగా మారి నెలరోజుల వ్యవధిలో 98 మంది ప్రాణాలు బలిగొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top