
అమెరికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత
ఇమిగ్రేషన్ విధానాలపై చర్చ
ఫ్లోరిడా: అమెరికాలో ముగ్గురు మృతికి కారణమైన ట్రక్కు డ్రైవర్ హర్జిందర్ సింగ్ కేసు వివాదాస్పదమవుతోంది. అతనికి క్షమాభిక్ష కోసం వేసిన ఆన్‌లైన్ పిటిషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. హర్జిందర్ సింగ్‌కు మద్దతుగా 15 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. అయితే.. హత్యానేరం ఎదుర్కొంటున్న వ్యక్తికి క్షమాభిక్ష కోరడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఇమిగ్రేషన్ సంబంధింత విధానాలపై చర్చకు దారి తీసింది.
ఫ్లోరిడాలోని ఫోర్ట్ పియర్స్‌లో భారతీయ డ్రైవర్ 28 ఏళ్ల హర్జిందర్ సింగ్ తప్పుడు యూ–టర్న్ తీసుకోవడంతో అతను నడుపుతున్న ట్రక్కు.. మినీ వ్యాన్‌ను ఢీకొంది. దీంతో అందులో ఉన్న ముగ్గురు మరణించారు. ఆగస్టు 12న ఈ ప్రమాదం జరిగింది. సింగ్ 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి కాలిఫోరి్నయాలో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ పొందాడని ఆరోపణలున్నాయి.
అయితే ఈ ప్రమాదం కేసులో గతవారం అతన్ని కాలిఫోరి్నయాలోని స్టాక్‌టన్‌లో అరెస్టు చేసి ఫ్లోరిడాకు తిరిగి అప్పగించారు. ఈ ప్రమాదం తరువాత పత్రాలు లేని వలసదారుల వల్ల ప్రమాదాల గురించి ఆందోళన తలెత్తింది. వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీకి అమెరికా ప్రభుత్వం తాత్కాలిక విరామం ప్రకటించింది. అయితే.. హర్జిందర్ సింగ్‌ను విడుదల చేయాలంటూ ఆన్‌లైన్‌లో పిటిషన్ వేశారు. అది ఒక విషాదకరమైన ప్రమాదమని, ఉద్దేశపూర్వకమైన చర్యకాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీంతో ఆ పిటిషన్‌కు ఎక్కడలేని ఆదరణ లభించింది. ఆయనకు క్షమాభిక్ష పెట్టాలంటూ 15లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. దీనిపై స్థానికంగా వ్యతిరకేత వస్తోంది. ముగ్గురు అమెరికన్ పౌరుల మరణానికి కారణమైన వ్యక్తిని విడుదల చేయాలని కోరుకుంటున్నవారి ఇమ్మిగ్రేషన్ స్థితిని తనిఖీ చేయాలంటూ డిమాండ్ మొదలైంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి తెల్లవాడైతే, చనిపోయినవారు భారతీయులైతే వారు ఇలాంటి పిటిషన్‌పై సంతకం చేయరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురిని హత్య చేసిన వ్యక్తికి శిక్ష పడకూడదని కోరుకోవడం హాస్యాస్పదమంటున్నారు. అతనికి మద్దతు ఇస్తున్నవారిని బహిష్కరించాలని కోరుతూ మరో పిటిషన్ ప్రారంభించారు. అమెరికా ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోదని, దానిని సమరి్ధంచే వారికి ఆశ్రయం ఇవ్వబోదని పిటిషన్‌లో పేర్కొన్నారు.