న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటనకు ముందు కీలకమైన సానుకూల పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రెండు ప్రధానమైన సాయుధ గ్రూపులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం ఢిల్లీలో మణిపూర్ ప్రభుత్వం, కుకీ నేషనల్ ఆర్గనైజేషన్(కేఎన్‌వో), యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్(యూపీఎఫ్)లతో కేంద్ర హోం శాఖ కార్యకలాపాల నిలిపివేత (సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్)కు సంబంధించిన త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.
గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చలు గురువారం మూడు పక్షాలు ఒప్పందంపై సంతకాలు చేయడంతో ముగిశాయని హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాదిపాటు అమల్లో ఉండే ఒప్పందంతో మణిపూర్ ప్రాదేశిక సమగ్రతకు ఎటువంటి భంగం కలగదని స్పష్టం చేసింది. ఏడు వర్గాలు కలిగిన యూపీఎఫ్, 13 వర్గాలున్న కేఎన్‌వోలు తమ కార్యకలాపాలను నిలిపివేస్తాయని తెలిపింది. చర్చలతో సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ముందుకు వచ్చాయని పేర్కొంది.
ఒప్పందం ప్రకారం రెండు సాయుధ గ్రూపులు సంక్షోభ ప్రాంతాల్లోని ఏడు క్యాంపులను వేరే చోటుకు మార్చడంతోపాటు మొత్తమ్మీద క్యాంపుల సంఖ్యను తగ్గించేందుకు అంగీకరించాయి. తమ వద్ద ఉన్న ఆయుధాలను బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ క్యాంపుల్లో అప్పగించడం, ఈ గ్రూపుల్లో ఎవరైనా విదేశీయులుంటే గుర్తించేందుకు భద్రతా బలగాలకు సహకారం అందించడం కూడా ఉన్నాయి.
ఒప్పందం అమలు, ఉల్లంఘనలను గుర్తించేందుకు ఉమ్మడి పర్యవేక్షణ బృందం ఏర్పాటైంది. ఈ బృందమే ఒప్పందాన్ని సమీక్షిస్తుందని హోం శాఖ తెలిపింది. మరో వైపు అత్యవసర వస్తువుల సరఫరాకు వీలుగా, వాహనాల రాకపోకలకు మణిపూర్ మీదుగా వెళ్లే రెండో నంబర్ జాతీయ రహదారిని తెరవాలని కుకీ–జో కౌన్సిల్(కేజెడ్‌సీ) నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో భద్రతా బలగాలతో సహకరించేందుకు కేజెడ్‌సీ అంగీకరించిందని హోం శాఖ పేర్కొంది.