Voter ID Card: 17 ఏళ్లకే ఓటర్‌ కార్డు దరఖాస్తుకు అవకాశం.. ఈసీ కీలక నిర్ణయం

17 Years Above Youth Allowed To Apply Voter ID Card In Advance - Sakshi

న్యూఢిల్లీ: ఓటర్‌ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టిన వారు మాత్రమే ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ, 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 17 ఏళ్లు నిండిన యువత ఓటర్‌ కార్డు కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఓటర్‌ కార్డు అందిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజివ్‌ కుమార్‌, ఎలక్షన్‌ కమిషనర్‌ అనుప్‌ చంద్ర పాండేల నేతృత్వంలోని ఈసీఐ.. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటర్‌ జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది.

ఏడాదిలో మూడుసార్లు అవకాశం.. 
యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తేదీల్లో ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈసీ. ప్రతి త్రైమాసికానికి ఓటర్‌ జాబితాను అప్డేట్‌ చేస్తారు. దాంతో ఆ మధ్య 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్‌ కార్డు జారీ చేశారు. 2023లో ఏప్రిల్‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్‌పీ యాక్ట్‌ 1950లోని సెక్షన్‌ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్‌ ఎలక్టోర్స్ రూల్స్‌, 1960 చట్టాల్లో మార్పులు చేసింది న్యాయశాఖ. దరఖాస్తు ఫారాలను సైతం యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చనుంది ఈసీ. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు.

ఇదీ చదవండి: గూగుల్‌తో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌.. సిగ్నల్స్‌ వద్ద వెయిటింగ్‌ ఉండదటా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top