
లక్నో: ఇది సినిమాను తలపించే వాస్తవ కథనం. రచయితలు సినిమా కథలను ఉత్కంఠ కలిగించేలా రాస్తుంటారు. వాటిని తెరమీద చూసినప్పుడు ప్రేక్షకులు నిజమనే భావనకు లోనవుతుంటారు. అయితే ఒక్కోసారి అవి అల్లిన కథలుగా తేలిపోతుంటాయి. ఉత్తరప్రదేశ్ వెలుగు చూసిన ఒక యధార్థ గాథ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితం తల్లిని అవమానించిన వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు ఆమె కుమారుడు చేసిన పని ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన సోసూ అనే యువకుని తల్లిపై పదేళ్ల క్రితం మనోజ్ అనే యువకుడు దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన సోను, మనోజ్‌ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా చోటుచేసుకుంది. తన తల్లికి జరిగిన ఘోర అవమానానికి కలత చెందిన సోను నాటి నుంచి మనోజ్ కోసం అన్వేషణ ప్రారంభించాడు. కాలం గడుస్తున్నప్పటికీ మనోజ్ తనలో సోనుపై ఉన్న పగను చల్లార్చుకోలేదు. మూడు నెలల క్రితం మనోజ్‌ను సోను ఇదే ప్రాంతంలోని మున్షి పులియాలో చూశాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు.
మనోజ్ రోజువారీ షెడ్యూల్‌ను నోట్ చేసుకున్నాడు. అతను ఎప్పుడెప్పుడు ఏమేమి చేసేదీ, ఎక్కడకు వెళ్లేదీ సోనూ గమనించాడు. నలుగురు స్నేహితుల సాయంతో మనోజ్‌ను అంతమొందించేందుకు ప్లాన్ చేశాడు. ఈ హత్య తర్వాత పార్టీ ఇస్తానని వారికి హామీ ఇచ్చాడు. మే 22న మనోజ్ తన దుకాణాన్ని మూసివేసి, ఒంటరిగా వెళుతున్న సమయంలో, సోనూ తన స్నేహితుల సాయంతో మనోజ్‌పై దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేరిన మనోజ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మనోజ్ హత్యకు పాల్పడిన వారిని సీసీటీవీలో గుర్తించారు. అయితే వారి ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఇంతలో సోనూ తన నలుగురు మిత్రులకు పార్టీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోనూ స్నేహితులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవే వారిని పోలీసులకు పట్టుబడేలా చేశాయి. సీసీటీవీ ఫుటేజీలలో కనిపించిన ఐదుగురు అనుమానితులలో ఒకరిని పోలీసులు సోషల్ మీడియా ఫోటోలలో గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు ఐదుగురు అనుమానితులను ట్రాక్ చేసి, అరెస్టు చేశారు. నిందితులు సోను, రంజిత్, ఆదిల్, సలాము, రెహమత్ అలీలను పోలీసులు విచారిస్తున్నారు.