మరికల్: దశాబ్దకాలం తర్వాత ఎన్నడూ లేనంతగా వరి రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. ఆయిల్‌పాం, మిరప, పత్తి పంటకు రికార్డు ధర లభించిందంటూ వార్తలు వస్తుంటాయి. ఏళ్ల తర్వాత ఈ ఖరీప్‌లో వరి ధాన్యం రికార్డు ధర పలుకుతోంది. తేమశాతంతో సంబంధం లేకుండా కల్లాల్లోనే పచ్చి ధాన్యాన్ని వ్యాపారులు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు పంట దిగుబడులు తెచ్చే అవకాశం తగ్గిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభం కావడంతో ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు సన్నరకం క్వింటాకు రూ.3,400 నుంచి రూ.3,600 వరకు చెల్లిస్తూ వ్యవసాయ క్షేత్రాల వద్దకు వచ్చి పచ్చి ధాన్యాన్నే కొనుగోలు చేస్తున్నారు. మంచి ధర రావడంతో రైతులు వారికే విక్రయిస్తున్నారు.
జిల్లాలో సాగు ఇలా..
జిల్లావ్యాప్తంగా 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతంతో పోలిస్తే 25 శాతం సాగు విస్తీర్ణం తగ్గింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక జలాశయాలు నిండకపోవడం, భూగర్భ జలాలు తగ్గడమే సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణం. కోయిల్‌సాగర్ జలాశయం నుంచి మూడువిడతలుగా సాగునీరు విడుదల చేయడంతో ఆయకట్టు కింద పంట చేతికొచ్చింది. జిల్లాలో 40.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వ్యాపారుల పరుగులు..
క్వింటాకు రూ.3,700 చెల్లించారు..
ఈ ఏడాది వానాకాలంలో 16 ఎకరాల్లో వరి సాగు చేశా. 5 ఎకరాల వరి పంట చేతికి రావడంతో కోత లు పూర్తయ్యాయి. వ్యాపారులు పొలం వద్దకు వచ్చి పచ్చి ధాన్యం క్వింటాకు రూ.3,700 చొప్పున కొనుగోలు చేశారు. పొలం వద్దనే తూకం వేయగా 161 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎన్నడూలేని విధంగా వరికి రికార్డు ధర లభించడం ఆనందంగా ఉంది. – మల్లారెడ్డి, రైతు, పూసల్‌పహాడ్
డబుల్ ధర వచ్చింది..
ఆరు ఎకరాల్లో సన్నరకం కేఎన్‌ఎం వరి సాగు చేశా. పంట కోత పూర్తిచేసి ఆరబెట్టాను. వ్యాపారులు పరిశీలించి క్వింటాకు రూ. 4,100 ధర చెల్లించి కొనుగోలు చేశారు. పొలం దగ్గరే తూకం వేయగా 155 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 25 ఏళ్ల నుంచి వరి సాగు చేస్తున్నా.. ఇంతవరకు ఎప్పుడూ ఇంత ధర రాలేదు. ప్రైవేట్ వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా చెల్లించడం సంతోషంగా ఉంది.
– నరహరి, రైతు, రాకొండ
ప్రభుత్వ నిబంధనలు ఇలా..
ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ. 2,461, సాధారణ రకానికి రూ.2,441 కనీస మద్దతు ధర ప్రకటించింది. 7 రకాల సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుంది. కేంద్రాలకు ధాన్యం తరలింపు, హమాలీ ఖర్చులు భరించి తేమశాతం 17 వస్తేనే క్వింటాకు రూ.2,961 ధర లభిస్తుంది. కానీ ప్రైవేట్ వ్యాపారులు కల్లాల్లోనే 30 శాతం తేమ ఉన్నా రూ.3,600 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
సన్నరకం వరి ధాన్యానికి భలే గిరాకీ
కల్లాలోనే పచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
క్వింటాకు రూ.3,600 పలుకుతున్న ధర
ఆనందంలో రైతులు
వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాల్లోని మిల్లర్లు, వ్యాపారులేగాక పక్కనే ఉన్న కర్ణాటక వ్యాపారులు సైతం ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. రైతుల వివరాలు తెలుసుకొని ముందుగానే వారిని కలిసి ధాన్యం తమకే విక్రయించాలని కోరుతుండటం గమనార్హం. కోత యంత్రాలు పొలాల్లో దిగిన వెంటనే వచ్చి పచ్చి ధాన్యాన్ని ట్రాక్టర్లు, ట్రక్కుల్లో నింపి తరలించడం కనిపిస్తోంది. పలు రైస్‌మిల్లుల్లో డ్రయ్యర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆరబెట్టిన ధాన్యానికి ఇచ్చే ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు పచ్చి ధాన్యానికి రూ.800 అధికంగా చెల్లించడంతో రైతులు వ్యాపారులకు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు.


