ఆదర్శం.. బలోపేతం | - | Sakshi
Sakshi News home page

ఆదర్శం.. బలోపేతం

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

మెరుగైన విద్య..

సీబీఎస్‌ఈ సిలబస్‌ అందించేందుకు మోడల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశారు. స్టేట్‌ సిలబస్‌తో నడుస్తున్నప్పటికీ విద్యార్థులు రాణిస్తున్నారు. ఈ ఏడాది జాతీయ పోటీ పరీక్షలు ఐఐటీ– జేఈఈ, నీట్‌ కోచింగ్‌ ఇచ్చేందుకు మా స్కూల్‌ ఎంపిక చేశారు. ఇప్పటికే మోడల్‌ స్కూళ్లలో భౌతిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. గతేడాది ఎస్సెస్సీలో 97 శాతం, ఇంటర్‌లో 68 శాతం ఉత్తీర్ణత సాధించాం. మా పాఠశాలలో చదివిన వారు ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. – శ్రీధర్‌,

మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, వెల్దండ

అచ్చంపేట: ఆదర్శ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇక మీదట సీబీఎస్‌ఈ స్కూళ్లుగా మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అలాగే 2027– 28 నుంచి ప్రీ ప్రైమరీతోపాటు ప్రాథమిక పాఠశాలలు కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. తద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2013లో మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేసింది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యనందిస్తున్నారు. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఆంగ్ల బోధన ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయి సిలబస్‌లోనే ఉంది. ఉమ్మడి జిల్లాలోని వెల్దండ, కోడేరు, కొత్తకోట, పెబ్బేరు, ఖిల్లాఘనపురం, ధన్వాడ, కోస్గి, గండేడ్‌ మండలాల్లో ఆదర్శ పాఠశాలలున్నాయి. ఇందులో సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య పెరగవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.

విద్యార్థుల సంఖ్య పెంపు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం 8 మోడల్‌ స్కూళ్లు ఉండగా.. 6 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 820 విద్యార్థుల ప్రవేశానికి అవకాశం ఉంది. 5 నుంచి 10 తరగతి వరకు 500, ఇంటర్మీడియట్‌లో 320 విద్యార్థులు ప్రవేశం పొందవచ్చు. ప్రతి స్కూల్‌లో 100 విద్యార్థినులకు హాస్టల్‌ వసతి ఉంటుంది. అయితే కొన్నిచోట్ల పాఠశాలలు దూరంగా ఉండటం, రోజురోజుకూ గురుకులాలు, కేజీబీవీలు పెరుగుతుండటంతో మోడల్‌ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోటీ పరీక్షలకు కోచింగ్‌

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షల కోచింగ్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మోడల్‌ స్కూళ్లలో 29 యంగ్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 2026– 27 విద్యా సంవత్సరంలోనే దీనిని అమలు చేస్తామని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ప్రకటించారు. జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసి ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు ఐఐటీ– జేఈఈ, నీట్‌, క్లాట్‌ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం 6మంది చొప్పున బోధనా సిబ్బందిని నియమిస్తారు. ఎంపికై న అధ్యాపకులు గంట ప్రాతిపదికన 152 పనిదినాలపాటు విద్యార్థులకు బోధించనున్నారు. కాన్సెప్ట్‌ ఆధారిత బోధన, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, సందేహాల నివృత్తి, అసైన్‌మెంట్లు, మాక్‌ టెస్టులు, వెనుకబడిన విద్యార్థులకు అదనపు సహాయం అందించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఈ నెల 14న నిధులు సైతం విడుదల చేసింది.

సీబీఎస్‌ఈ స్కూళ్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8 మోడల్‌ స్కూళ్లు

ఒక్కో పాఠశాలలో 820 మందికి ప్రవేశం

ఈ ఏడాది నుంచి

ఐఐటీ– జేఈఈ, నీట్‌ కోచింగ్‌

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు చర్యలు

సీబీఎస్‌ఈ బోర్డు నుంచి..

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ను అనుసరిస్తే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాంపిటేటివ్‌ పరీక్షలు, సివిల్స్‌ లాంటి ప్రవేశ పరీక్షలకు సీబీఎస్‌ఈ సిలబస్‌ తోడ్పడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అందుకే మోడల్‌ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌తోపాటు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే సీబీఎస్‌ఈ బోర్డు నుంచి ఎఫిలియేషన్‌ పొందాల్సి ఉందని సమాచారం. ప్రీ ప్రైమరీతోపాటు 1 నుంచి 5వ తరగతి వరకు ఈ ఏడాది నుంచే అమలుకు సన్నాహాలు చేసినా సీబీఎస్‌ఈ నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement