దామరగిద్ద: నేలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. ఖేతి బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కన్కిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. భూసార పరీక్షలు చేయించడంతో పాటు సమతుల ఎరువుల వినియోగం ఎంతో అవసరమన్నారు. ప్రకృతి వ్యవసాయం, పంట అవశేషాల సమగ్ర నిర్వహణ చేపట్టాలని సూచించారు. పంట అవశేషాలను కాల్చడంతో నేల కర్బన పదార్థాలు, పోషక విలువలను కోల్పోతుందన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, వచ్చే యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలైన నూనెగింజలు, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలు సాగు చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా బోరుబావులు తవ్వవద్దని, ప్రభుత్వ సూచనల మేరకు పంటలు సాగు చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఓ బాలాజీప్రసాద్, ఏఈఓలు గోపాల్, నరేష్, అజయ్, రవికుమార్, స్థానిక రైతులు పాల్గొన్నారు.


