● వచ్చేది మన ప్రభుత్వమే.. రైతులకు అండగా ఉంటాం
● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కందనూలు: రైతులకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి దశదిన కర్మకు హాజరైన ఆయన తిరుగు ప్రయాణంలో మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల వద్ద మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ వద్ద వాపోయారు. వ్యాపారుల వద్ద మిత్తికి అప్పులు తెచ్చి పంటలు సాగు చేశామని, ఆ మిత్తి పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదని తమ గోసను వెలిబుచ్చారు. ఒకపక్క సాగునీరు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క యూరియా దొరకక అవస్థలు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా వారిని పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని సృష్టించిన విపత్తు అని దుయ్యబట్టారు. రైతుల పంటలకు సరిపడా నీరు ఇస్తే పంటలు పండితే ధాన్యాన్ని కొనాల్సి వస్తుందని, అలాగే వారికి డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాలో 8.30 లక్షల ఎకరాలకు నీరు అందించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూశామని గుర్తుచేశారు. నదులు, ప్రాజెక్టులలో పుష్కలంగా నీరున్నా.. రైతుల పంటలకు అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతుంటే అధికార పార్టీకి చెందిన ఏ నాయకుడికి రైతులను పలకరించే తీరిక లేకుండాపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. పాలమూరు జిల్లా రైతులకు ఎండబెట్టి ఆంధ్ర ప్రభుత్వానికి నీటిని ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన నిలబడి తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని, రాష్ట్రంలో వచ్చేది మన ప్రభుత్వమే.. అండగా ఉంటామని కేటీఆర్ రైతులకు భరోసానిచ్చారు. కేటీఆర్ వెంట ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు.


