నారాయణపేట: జిల్లావ్యాప్తంగా ఆదివారం రెండోవిడత నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు 16,945 మంది అభ్యాసకులు హాజరయ్యారు. చదవడం, రాయడంతో పాటు లెక్కలపై మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. 24,668 మందికిగాను 16,945 మంది హాజరయ్యారు. సెర్ఫ్, డీఆర్డీఏ, మెప్మా శాఖల సమన్వయంతో మహిళా సంఘాల్లోని నూతన అభ్యాసకులకు వివిధ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి డా. గోవిందరాజు మరికల్, ధన్వాడ మండలాల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ప్రాజెక్టు అధికారి (వయోజన విద్య) శ్రీనివాసబాబు, జిల్లా కో–ఆర్డినేటర్ రఘునాథ్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు గోవిందు, మాసన్న, జయన్న, ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.
నేడు కోస్గిలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం
నారాయణపేట: సర్ ప్రక్రియలో ఓటరు జాబితా సవరణ, పేర్ల తొలగింపు, కొత్త ఓటరు నమోదు తదితర అంశాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 10 గంటలకు కోస్గిలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కొడంగల్ నియోజకవర్గ ఇన్‌న్‌చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ హాజరవుతున్నరని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
సాగునీటి వృథా..
తప్పని వ్యధ
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద వరద నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన సమాంతర కాల్వ షట్టర్ల మరమ్మతు పూర్తిగాకపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నిల్వనీరు వృథాగా పారుతోంది. ప్రభుత్వం మూడేళ్ల కిందట షట్టర్ల మరమ్మతుకు రూ.20 లక్షలు మంజూరు చేసింది. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న సమయంలో కాల్వ ప్రధాన హెడ్ రెగ్యులేటరీ వద్ద షట్టర్లకు నీటి సరఫరా నిలిపివేసేందుకు రింగ్‌బండ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతిసారి రింగ్‌బండ్ ఏర్పాటు చేయడం.. వచ్చిన వరద ప్రవాహంతో మొర్రం కొట్టుకుపోవడంతో మరమ్మతు పూర్తి కావడం లేదు. ప్రస్తుత సమయంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయక చేతులెత్తేస్తున్న అధికారులు.. సమాంతర కాల్వ నుంచి రోజు 60 నుంచి 100 క్యూసెక్కుల నీరు లీకేజీ రూపంలో వృథాగా పారుతున్నా అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికై నా స్పందించి సమాంతర కాల్వ షట్టర్ల మరమ్మతు పూర్తిచేసి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


