నారాయణపేట: విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమమే ప్రాధాన్యంగా నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రషీద్ అన్నారు. జిల్లాకేంద్రం శివారులోని మైనార్టీ బాలుర జూనియర్ కళాశాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాబోధన, విద్యార్థుల హాజరు, వసతి, భోజన సదుపాయాలను పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థుల హాజరు పట్టికలు, వివిధ రికార్డులను తనిఖీ చేసి వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం తాజాగా ఉండేలా చూడటంతో పాటు పాలు, నూనె తదితర సరుకుల గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. గడువు ముగిసిన, నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్టోర్‌రూమ్‌ను పరిశీలించి వంటసామగ్రి, ఆహార పదార్థాల నిల్వలను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాలను నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వర్, అధ్యాపకులు పాల్గొన్నారు.
పర్యాటకంతో ప్రాంతాలకు గుర్తింపు..
నారాయణపేట: చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు, దేవాలయాలు, జానపద కళలు, సంప్రదాయాలను పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేస్తే ఆయా ప్రాంతాలకు గుర్తింపు పెరగడంతో పాటు స్థానిక ప్రజలకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని డీపీఆర్వో, టూరిజంశాఖ ఇన్‌చార్జి అధికారి రషీద్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రం శివారులోని మైనార్టీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత పర్యాటక ప్రదేశాల విశిష్టతను తెలుసుకొని వాటి పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. పర్యాటక ప్రదేశాలను సందర్శించడంతో విద్యార్థులు పుస్తకాల్లో చదివిన చరిత్ర, సంస్కృతిపై ప్రత్యక్ష అవగాహన ఏర్పడుతుందన్నారు. పర్యాటక రంగంతో హోటళ్లు, రవాణా, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులు, గైడ్ సేవలు తదితర రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ చారిత్రక కట్టడాలపై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జగదీశ్వర్, బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


