మాట్లాడుతున్న కలెక్టర్ సీహెచ్ ప్రియాంక.. హాజరైన అధికారులు
నారాయణపేట: అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్ర భుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణానికి అర్హులైన లబ్ధిదారుల జాబితాలను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కొడంగల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీల వారీగా వివరాలను సిద్ధం చేసి, ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారుల వివరాలను మరోసారి పరిశీలించాలని, పెండింగ్‌లో ఉన్న అర్హత కేసులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆధార్ తదితర అవసరమైన వివరాలు లేని లబ్ధిదారుల సమాచారాన్ని మూడు రోజుల్లో సేకరించి జాబితాలను పూర్తిచేయాలని సూచించారు. అర్హత కలిగిన కేసుల్లో ధ్రువీకరణ, శాఖాపరమైన పరిశీలన, మంజూరు ప్రక్రియలను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని కోరారు. అధికారుల స్థాయిలో పూర్తిచేయాల్సిన ప్రక్రియను ఆలస్యం చేయకుండా ముగించి అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని స్పష్టం చేశారు. భౌతికంగా నిర్మాణానికి అనుకూలంగా లేని, క్లిష్టమైన లేదా గ్రౌండింగ్ కాని కేసులను ప్రత్యేకంగా గుర్తించి వాటి వివరాలను వేరుగా సమర్పించాలని సూచించారు. హౌసింగ్ పనుల పురోగతిపై వచ్చే వారం మరోసారి సమీక్ష నిర్వహించనున్నందున.. అప్పటిలోగా లబ్ధిదారుల జాబితాలు, ప్రతిపాదనలు, పెండింగ్ కేసుల వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, పీఆర్ శాఖలు మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన పనుల జాబితాలను కూడా సమగ్రంగా రూపొందించి ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అవసరమైన రోడ్లకు ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి తుది జాబితా అందించాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్, కోస్గి, మద్దూరు పుర కమిషనర్లు నాగరాజు, శ్రీకాంత్, కొడంగల్ నియోజకవర్గంలోని మండలాల ఎంపీడీఓలు, హౌసింగ్, ఆర్‌అండ్‌బీ, పీఆర్ శాఖల ఏఈలు పాల్గొన్నారు.


