గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా జిల్లావ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డా. వినీత్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. నారాయణపేట, మక్తల్‌లో గణేష్ శోభాయాత్ర, నిమజ్జన మార్గాలను సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, డ్రోనన్‌కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కంట్రోల్‌రూమ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు లేదా సమస్యలు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. డయల్ 112కు వచ్చే కాల్స్‌పై వేగంగా స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు.
1,300 విగ్రహాల నిమజ్జనం..
జిల్లాలో ఏర్పాటు చేసిన 1,728 విగ్రహాల్లో ఇప్పటికే సుమారు 1,300 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు ఎస్పీ తెలిపారు. మిగిలిన నిమజ్జనాలు కూడా ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని కోరారు. చెరువుల వద్ద నిర్వాహకులు, కమిటీ సభ్యులు భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112కు లేదా నారాయణపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 70399 సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్‌హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, ఆర్‌ఐ విజయభాస్కర్, ఎస్‌బీ ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


