బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు ఆగం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పాలనలో పాలమూరు ఆగం

Sep 25 2026 1:29 AM | Updated on Sep 25 2026 1:29 AM

వనపర్తి: తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలకు గుర్తుకురావడం హాస్యాస్పదమని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డితో కలిసి ఎన్‌నినో ప్రభావం.. సాగు, తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, వరద జలాల అంశంపై ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పాలకులు పాలమూరును ఎండబెట్టి ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ప్రాజెక్టు వద్దకు వెళ్లి అమాయకులైన రైతుల ఎదుట వీరంగం చేయడం సరికాదన్నారు. నవంబర్‌ వరకు సాగునీరు అందించేందుకు ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందని తెలిపారు. ప్రస్తుతం వస్తున్న వరద కొనసాగినంత వరకు రోజు కాల్వలకు నీరందించి.. వరద ఆగిన తర్వాత వారాబందీ లెక్కన అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిల్వ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. పదేళ్లు రైతులను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు రాజకీయ స్వార్థంతో కపట ప్రేమ చూపుతున్నారంటూ విమర్శించారు. 2015లో శంకుస్థాపన చేసిన పాలమూరు–రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదు.. ఆ తర్వాత శంకుస్థాపన చేసిన కాళేశ్వరం ఎలా పూర్తి చేశారనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు. వారాబందీ విధానంలో లష్కర్లు, ఇతర సిబ్బందిని వినియోగించి డిస్ట్రిబ్యూటరీ వారీగా ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో సమానంగా నీరు వదలాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఆయకట్టు రైతులు సాగుచేసిన వానాకాలం పంటలను కాపాడటానికి ముందుగానే కర్ణాటక ముఖ్యమంత్రికి నీటి విడుదలపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని.. అసెంబ్లీ కారణంగా రెండ్రోజులు ఆలస్యమైందని, అంతలోపే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయని తెలిపారు. నీటి విడుదలకు సహకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు జిల్లా రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వానకాలం పంటలు కాపాడటానికి నవంబర్‌ 27 వరకు వారాబందీ విధానంలో నీటిని విడుదల చేస్తామని.. రైతులు అధైర్యపడొద్దని మంత్రులు చెప్పారు.

విషయం తెలుసుకునే రాద్ధాంతం..

కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని పంటల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాసిన విషయం తెలుసుకొనే బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు జూరాల ప్రాజెక్టుకు వద్దకు వెళ్లి రైతుల ముందు రాజకీయ రాద్దాంతం చేశారని ఎంపీ మల్లురవి ఆరోపించారు. వారి అసత్యపు ఆరోపణలు రైతులు నమ్మే పరిస్థితి లేదని.. నాటి నుంచి నేటి వరకు రైతుల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్సేనని తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ 2015లో కేంద్ర ప్రభుత్వం కృష్ణానది జలాల వాటాపై ఏర్పాటు చేసిన సమావేశంలో 299 టీఎంసీల నీటివాటా చాలని బీఆర్‌ఎస్‌ నాయకులు సంతకాలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంఎస్‌ల వాటాను అప్పగించిన నాడే పాలమూరు రైతులకు అన్యాయం చేశారని అన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొడుతున్న మాయగాళ్ల మాటలను రైతాంగం నమ్మవద్దని సూచించారు. జిల్లా వరప్రదాయిని అంటున్న పాలమూరు ప్రాజెక్టులోని ప్రధాన ఐదు రిజర్వాయర్ల పనులు ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గట్టు, గూడెందొడ్డి, భూత్పూరు రిజర్వాయర్లతో ఆయా ప్రాంతాల్లోని రైతులకు సాగునీరందిస్తాం.. కుర్చి వేసుకొని కూర్చొని పనులు చేయిస్తామని చెప్పిన గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరులోని ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు కేవలం 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాలపై ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. పదేళ్ల కాలంలో పాలమూరులో హామీ ఇచ్చిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి ఉంటే ఎన్‌నినోలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ సాగునీటి ఎద్దడి ఉండేది కాదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement