మక్తల్/మాగనూర్(కృష్ణా): రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని.. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి విషయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రజాప్రతినిధుల బాధ్యతని స్పష్టం చేశారు. శనివారం మక్తల్ 7వ వార్డులో గుర్లపల్లి వరకు రూ.3 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ, కృష్ణా మండలం గురజాలలో సుమారు రూ.2.40 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, మండలంలోని వడ్వాట్‌లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.550 కోట్లతో బీటీ పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకొని విమర్శలు చేయాలని.. వారి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మక్తల్ పురపాలికలోని ప్రతి వార్డులో రహదారులు, డ్రైనేజీ సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమన్నారు. గతంలో గురుజాలకు రోడ్డు నిర్మాణం పూర్తిచేసిన తర్వాతే గ్రామంలో అడుగుపెడతానని హామీ ఇచ్చానని.. మాట ప్రకారం కేవలం 14 నెలల్లో పనులు పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మక్తల్‌లో జరిగిన కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ వాకిటి మానస, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, తహసీల్దార్ సతీష్‌కుమార్, పుర కమిషనర్ రాజయ్య, 7వ వార్డు కౌన్సిలర్ శ్రీవిద్య, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.


