దివ్వెల పండుగ.. | - | Sakshi
Sakshi News home page

దివ్వెల పండుగ..

Nov 8 2026 5:29 AM | Updated on Nov 8 2026 5:29 AM

● చెడుపై మంచి

విజయానికి ప్రతీక

● నేడు జిల్లావ్యాప్తంగా

దీపావళి సంబరాలు

● ఆనందాల వేళ.. అప్రమత్తతే రక్షణ

● లక్ష్మీదేవి ఆరాధనలో భక్తజనం

● మార్వాడీ కుటుంబాల్లో

ఐదురోజుల సంబరాలు

గోగునార కట్టలతో దిష్టితీత..

గ్రామీణ ప్రాంతాల్లో దీపావళి వేడుకలకు ప్రత్యేక సంప్రదాయం ఉంది. ‘దివ్వి దివ్వి దీపావళి..’ అంటూ చిన్నారులు ఉత్సాహంగా పాటలు పాడుతుండగా పెద్దలు గోగునార కట్టలతో తయారుచేసిన దుందువాతో దిష్టి తీస్తారు. పొలాల్లో లభించే గోగునార కట్టలను సేకరించి వాటికి గుడ్డ పీలికలు చుట్టి కాగడాలుగా వెలిగిస్తారు. కుటుంబ సభ్యులకు దిష్టి తీసి శుభం కలగాలని ఆకాంక్షిస్తారు.

మార్వాడీ

కుటుంబాల్లో..

నారాయణపేటలో సుమారు 300 ఏళ్ల క్రితమే రాజస్థాన్‌ నుంచి వచ్చిన మార్వాడీ కుటుంబాలు వ్యాపార నిమిత్తం స్థిరపడ్డాయి. ప్రస్తుతం వందకుపైగా కుటుంబాలు ఉన్నాయి. వీరు తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఐదురోజుల పాటు పండుగ జరుపుకొంటారు. ధన్తేరస్‌, రూప్‌చౌదస్‌, దీపావళి లక్ష్మీపూజ, గోవర్ధనన్‌ పూజ, బైదూజ్‌ వేడుకలు నిర్వహిస్తారు. ఉపవాస దీక్షలు, లక్ష్మీనారాయణస్వామి పూజలు, పెద్దల ఆశీర్వాదాలతో కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సంబరాలు జరుపుకొంటారు.

నారాయణపేట: అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే వెలుగుతో పారద్రోలే పవిత్ర పర్వదినం.. అధర్మంపై ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.. భక్తి, సంప్రదాయం, ఆనందాల కలయికే దీపావళి. ఆదివారం జిల్లావ్యాప్తంగా వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఇందుకోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఇళ్లలో దీపారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఆశ్వీయుజ మాస అమావాస్య రోజున జరుపుకునే ఈ పర్వదినాన్ని ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి దీపావళి, దీపాలిక, కౌముదీ మహోత్సవం, దివ్వెల పండుగగా పిలుస్తారు. దీపాన్ని జ్ఞానానికి, పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఇంటి గడప నుంచి దేవాలయాల వరకు దీపాల వరుసలు వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మూడురోజుల పాటు, మరికొన్ని చోట్ల ఐదురోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తారు. కుమ్మరుల చేతుల్లో రూపుదిద్దుకున్న మట్టి ప్రమిదలు సంప్రదాయ వైభవాన్ని చాటుతుండగా.. గోగునార కట్టలతో దిష్టితీసే గ్రామీణ ఆచారం పల్లె సంస్కృతిని గుర్తుచేస్తోంది. మరోవైపు రాజస్థానీ మార్వాడీ కుటుంబాలు ఐదురోజుల పాటు తమ ప్రత్యేక ఆచార వ్యవహారాలతో లక్ష్మీనారాయణుడిని ఆరాధిస్తూ వేడుకలు నిర్వహిస్తారు. వెలుగుల పండుగలో ఆనందంతో పాటు బాణసంచా విషయంలో అప్రమత్తత పాటిస్తూ పర్యావరణహిత దీపావళి జరుపుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement