జిల్లాకేంద్రంలోని ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌లో
ఏర్పాటు చేసిన దుకాణాలు
నారాయణపేట: టపాసుల మోత మాటున ప్రమాదం పొంచి ఉంది. వ్యాపారుల కాసుల వేటలో ప్రజల భద్రతను గాలికొదిలేశారు. నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేశామంటూ అనుమతులు తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ ట్రేడ్ లైసెనన్స్‌లు తీసుకోకుండానే విక్రయాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● జిల్లాకేంద్రంలో ఒకేచోట బాణసంచా విక్రయాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బహిరంగ స్థలాన్ని కేటాయించారు. ఈ నిర్ణయం ప్రజల భద్రత, ప్రమాదాల నివారణకు ఉపయోగపడుతుందని భావించారు. కానీ కేటాయించిన స్థలంలో 15 దుకాణాలకు మించి ఏర్పాటు చేసే పరిస్థితి లేదని పరిశీలకులు చెబుతున్నారు. అయినప్పటికీ ఏకంగా 23 దుకాణాలకు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. స్థల విస్తీర్ణం ఎంత? దుకాణాల మధ్య ఉండాల్సిన దూరం ఎంత? అగ్నిప్రమాదం జరిగితే ప్రజలు బయటకు వెళ్లే మార్గం ఉందా? అన్న అంశాలను ముందుగానే పరిశీలించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తే బాగుండేదని చెబుతున్నారు. జిల్లాకేంద్రంలో ఇలా ఉంటే మరికల్, మక్తల్, కోస్గి, మద్దూర్‌తో పాటు మండల కేంద్రాల్లో క్రాకర్స్ దుకాణాల విక్రయాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి అధికార యంత్రాంగం ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు.
కానరాని ఇసుక బకెట్లు, నీటి డ్రమ్ములు..
బాణసంచా విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాద నివారణకు ఇసుక బకెట్లు, నీటి సదుపాయం, పనిచేసే అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి. కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన దుకాణాలను పరిశీలించినప్పుడు ఒక్కో కేంద్రం వద్ద ఉండాల్సిన నాలుగు ఇసుక బకెట్లు, నీటితో నింపిన డ్రమ్ములు కనిపించలేదు. దుకాణాలన్నీ ఒకేచోట ఉండటంతో ఒక దుకాణంలో మంటలు చెలరేగితే పక్కనున్న దుకాణాలకూ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు రక్షణ చర్యలు అత్యంత కీలకం. పండుగ సందడి మధ్య చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద విషాదానికి దారితీయవచ్చు.
లైసెన్స్‌లు లేకుండానే..
మరోవైపు మున్సిపల్ ట్రేడ్ లైసెన్‌న్స్‌ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. క్రాకర్స్ విక్రయదారులు ఇప్పటి వరకు మున్సిపల్ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్‌న్స్‌లు పొందలేదని సమాచారం. బాణసంచా విక్రయానికి అవసరమైన ఇతర చట్టబద్ధ అనుమతులు, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ వేర్వేరు అంశాలు కావడంతో వాటి స్థితిగతులను అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
ట్రేడ్ లైసెన్సులు జారీ చేస్తాం..
పట్టణంలోని ఇంటిగ్రేటేడ్ మార్కెట్ స్థలంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలకు ట్రేడ్ లైసెన్సులను జారీ చేస్తాం. ఇప్పటి వరకు తమ వద్దకు ఎవరూ రాలేదు. పుర సిబ్బందిని అక్కడికి పంపించి పూర్తిస్థాయిలో నిబంధనల మేరకు ఉన్న వాటికి ట్రేడ్ లైసెన్సులు ఇస్తాం.
– ఎన్.శంకర్, పుర కమిషనర్, నారాయణపేట
ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండానే టపాసుల విక్రయాలు?
అధికారుల అలసత్వం.. వ్యాపారుల ఇష్టారాజ్యం
జిల్లాకేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో భద్రత డొల్ల
15 దుకాణాల స్థలం.. 23 కేంద్రాలు ఏర్పాటు


