బాధ్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ

Nov 8 2026 5:29 AM | Updated on Nov 8 2026 5:29 AM

కోస్గి రూరల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పోలీస్‌ యంత్రాంగం పటిష్ట భద్రత చర్యలు చేపట్టిందని ఎస్పీ డా. వినీత్‌ తెలిపారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సీఎం పర్యటన బందోబస్తు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 300 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందిని బందోబస్తుకు నియమించామని.. రెండు తెలంగాణా స్పెషల్‌ బెటాలియన్‌తో విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. 9 సెక్టార్లుగా విభజించి.. ప్రతి సెక్టార్‌కు డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు ఇన్‌చార్జిలు ఉంటారని తెలిపారు. ప్రతి ప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా పటిష్ట భద్రత ప్రణాళికలను రూపొందించామన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ భద్రత చర్యలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పరస్పర సహకారంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం సరికాదని.. బాధ్యతగా పని చేయాలని తెలిపారు. అనంతరం మ్యూజియం పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి భద్రతపరమైన చర్యలపై దిశా నిర్ధేశం చేశారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రియాజ్‌ హుల్‌హక్‌, డీఎస్పీలు మహేష్‌, లింగయ్య, సీఐలు సైదులు, శివశంకర్‌, రాంలాల్‌, భగవంత్‌రెడ్డి, పలువురు ఎస్‌ఐలు ఉన్నారు.

సీఎం సభ

విజయవంతం చేద్దాం

నారాయణపేట: కొడంగల్‌లో సోమవారం జరిగే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు భారీఎత్తున తరలిరావాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి (జీఎంఆర్‌), డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బహిరంగ సభకు జిల్లా నుంచి భారీగా జనాన్ని తరలించేలా మండలాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రవాణా, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో జిల్లా, మండల, పట్టణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులతో పాటు డీసీసీ కార్యవర్గసభ్యులు, యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌న్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్‌ ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల నాయకులు, కిసాన్‌సేన ప్రతినిధులు, రైతుసంఘాల నాయకులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement