నారాయణపేట: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరం 9, 11వ తరగతుల్లో ఖాళీల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియనుందని.. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష 2027, ఏప్రిల్ 10న జరగనుందని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని.. విద్యార్థులు, తల్లిదండ్రులకు పరీక్ష, దరఖాస్తు విధానం తదితర వివరాలను తెలియజేసి గరిష్టంగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎన్‌హెచ్‌ఎంలో
ఉద్యోగ అవకాశాలు
నారాయణపేట:నేషనల్ హెల్త్ మిషనన్ (ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రామ్‌లో భాగంగా జిల్లాలో వివిధ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. కె.జయచంద్రమోహన్‌న్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీసీసీఎం–1, పల్లె దవాఖానా ఎంఎల్‌హెచ్‌పీ/సీహెచ్‌ఓ/వైద్యాధికారి– 6, వైద్యు డు (ఎంబీబీఎస్/ఎండీ)–1, స్టాఫ్ నర్స్ (ఎన్‌సీడీ)–1, ఫిజియోథెరపిస్ట్ (ఎన్‌పీహెచ్‌ఈ)–1, ఫార్మసిస్ట్ (ఆర్‌బీఎస్‌కే)–1, ల్యాబ్ టెక్నీషియన్ (ఆర్‌ఎన్‌టీసీపీ)–1 ఖాళీలున్నాయని.. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 25 నుంచి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అక్టోబర్ 11 సాయంత్రం 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని.. పోస్టు ద్వారా పంపిన దరఖాస్తులు ఆలస్యంగా అందితే కార్యాలయం బాధ్యత వహించదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు జిల్లా అధికారిక వెబ్‌సైట్
www.narayanapet.telangana.gov.inను సంప్రదించాలని సూచించారు.
సాగునీటి కోసం
అన్నదాతల ఆందోళన
మరికల్: కోయిల్‌సాగర్ కాల్వకు జూరాల నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని బుధవారం జిన్నారం రైతులు జూరాల కాల్వ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఆంజనేయులు, రఘుపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి పంటలు పొట్టదశలో ఉన్నాయని, ఒక తడి నీటికి ఉంద్యాల పంపుహౌస్ దగ్గర పదిరోజుల పాటు మోటార్లు ప్రారంభిస్తే పంటలతో పాటు చెరువులు నీటితో నింపడానికి అవకాశం ఉందన్నారు. జూరాల జలాశయంలో ప్రస్తుతం 9 టీఎంసీల నీరు ఉందని, ఒక టీఎంసీ నీటిని కోయిల్‌సాగర్‌కు వదిలి రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో వెయ్యి ఎకరాల వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. సాగునీరు వదలకుంటే రైతుసంఘం ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, అనిల్, కాంత్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, వెంకటన్న పాల్గొన్నారు.


