నారాయణపేట: రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.సక్రియానాయక్ సూచించారు. వ్యవసాయశాఖ సంచాలకులు, డైరెక్టర్ గోపీ ఆదేశాల మేరకు బుధవారం డీఏఓ కార్యాలయం వద్ద ఫార్మర్ రిజిస్ట్రీపై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని మండలాలు, గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఫార్మర్ రిజిస్ట్రీ కాని రైతులను గుర్తించి నమోదు చేయించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కల్పించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేయడంతో పాటు ధాన్యం విక్రయించాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ గుర్తింపు నంబర్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. రైతులు తమ సమీపంలోని ఏఈఓలు, మీ–సేవ కేంద్రాలు, కామనన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి బాల దినకర్, ఏఈఓలు రాజేష్, అనిల్, మక్తల్ ఏడీఏ నాగేశ్‌కుమార్ పాల్గొన్నారు.


