● ఓటు తొలగింపునకు కాదు..
వివరాల నిర్ధారణ కోసమే...
● 11 ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి
అందజేస్తే సరిపోతుంది
● పారదర్శకంగా, పకడ్బందీగా
‘సర్’ నిర్వహణ
● ‘సాక్షి’ ఫోన్–ఇన్‌లో
రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను
–8లో u
ప్రశ్న: నోటీసు వచ్చింది.. కానీ బీఎల్వో ఇంటికి రాలేదు. ఎవరిని సంప్రదించాలి? ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల ఉంటే ఏం చేయాలి?
– యూసుప్ తాజ్,
నారాయణపేట టౌన్
అడిషనల్ కలెక్టర్: సంబంధిత పోలింగ్ కేంద్రం బీఎల్వోను లేదా ఏఈఆర్వో/ఈఆర్వో కార్యాలయాన్ని సంప్రదించాలి. నోటీసులో ఇచ్చిన వివరాల ప్రకారం కూడా సంబంధిత అధికారిని సంప్రదించవచ్చు. ఒక వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓటు ఉండకూడదు. ఒకచోట ఓటును కొనసాగిస్తూ మరోచోట ఉన్న నమోదును తొలగించేందుకు సంబంధిత ప్రక్రియను అనుసరించాలి. ఇందుకు ఎన్నికల విభాగం సూచించే ఫారాన్ని ఉపయోగించాలి.
ప్రశ్న: పాత ఓటరు జాబితాలో కుటుంబసభ్యుల పేర్లు లేకపోతే వివరాలు ఎలా
ఇవ్వాలి? – రాజు, నారాయణపేట
అడిషనల్ కలెక్టర్: కుటుంబ సంబంధాలను నిర్ధారించే అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు, జనన ధ్రువపత్రం వంటి ఆధారాలను అధికారులు సూచించిన విధంగా సమర్పించాలి.
నారాయణపేట: నోటీసులు వచ్చాయని ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 ధ్రువపత్రాల్లో ఒకటి బీఎల్వోలకు అందజేస్తే పరిశీలించి అర్హత ఉన్నవారి ఓటుహక్కును కొనసాగిస్తారని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. సర్ సందేహాలపై మంగళవారం ఉదయం 10 నుంచి 11 వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్–ఇన్ నిర్వహించగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఓటర్లు ఫోన్‌చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సర్‌ను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓటుహక్కు తొలగించేందుకు కాకుండా పాత, ప్రస్తుత ఓటరు జాబితాల్లోని వివరాలను నిర్ధారించుకునేందుకు, అవసరమైన పత్రాలను సమర్పించేందుకు నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. బీఎల్వోలు సమర్పించిన ఆధారాలను పరిశీలించి అర్హత ఉన్నవారి వివరాలను ఆన్‌లైనన్‌లో నమోదు చేస్తారని తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాలు, విచారణ ప్రక్రియ అనంతరం 2026, నవంబర్ 9న తుది ఓటరు జాబితా ప్రచురించే ప్రక్రియ ఉంటుందని తెలిపారు.
ప్రశ్న: నోటీసు వస్తే ఎలాంటి ధువ్రపత్రాలు అందజేయాలి ? – వెంకటప్ప, మద్దూర్
అడిషనల్ కలెక్టర్: 1987కు ముందు జన్మించినవారు స్థానికతను నిర్ధారించే ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి, 1987–2004 మధ్య జన్మించినవారు తమ ధ్రువపత్రంతో పాటు ఈ ప్రాంతంలో తండ్రి ఓటుహక్కు వినియోగించినట్లు చూపించే ఓటరు జాబితా వివరాలు, ఎపిక్ నంబర్ తదితర ఆధారాలను సమర్పించాలి. 2004–2025 మధ్య జన్మించినవారు తమ స్థానికతకు సంబంధించిన ధ్రువపత్రంతో పాటు కుటుంబ సభ్యుల్లో కనీసం ఇద్దరి ఓటరు జాబితా వివరాలను సమర్పించాలి.
ప్రశ్న: కుటుంబంలో ఒకరికి నోటీసు వచ్చి మరొకరికి రాకపోవడానికి కారణం ఏమిటి?
– సూర్యకాంత్, మాజీ కౌన్సిలర్,
నారాయణపేట
అడిషనల్ కలెక్టర్: ప్రతి ఓటరు వివరాలను విడిగా పరిశీలిస్తారు. పాత, ప్రస్తుత జాబితాల్లో ఉన్న వివరాల ఆధారంగా అవసరమైన వారికి మాత్రమే నోటీసులు జారీ చేస్తారు. ఒక కుటుంబంలో అందరికీ తప్పనిసరిగా నోటీసులు రావాల్సిన అవసరం లేదు.
ప్రశ్న: క్లెయిమ్స్, అభ్యంతరాలు ఎప్పటి వరకు స్వీకరిస్తారు? – రవి, నారాయణపేట
అడిషనల్ కలెక్టర్: ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్స్ సమర్పించేందుకు అక్టోబర్ 7 వరకు అవకాశం ఉంది. నోటీసులు అందుకున్న వారు గడువులోగా అవసరమైన ఆధారాలతో బీఎల్వోలను సంప్రదించాలి.
ప్రశ్న: నోటీసు వచ్చినవారు ఏ ఫారం ఇవ్వాలి?
– రమేష్, మరికల్
అడిషనల్ కలెక్టర్: నోటీసులో పేర్కొన్న అంశం, అవసరమైన సవరణను బట్టి సంబంధిత ఎన్నికల ఫారం సమర్పించాలి. బీఎల్వో లేదా ఎన్నికల విభాగం అధికారుల సూచన మేరకు సరైన ఫారం, అవసరమైన ధ్రువపత్రాలను అందజేయాలి.
ప్రశ్న: ఓటర్లు ముఖ్యంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – నారాయణ, కోస్గి
అడిషనల్ కలెక్టర్: నోటీసు వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నోటీసులో పేర్కొన్న అంశాన్ని తెలుసుకొని అందుబాటులో ఉన్న సరైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచాలి. బీఎల్వోలకు సహకరించి నిర్ణీత గడువులో సమర్పించాలి.
ప్రశ్న: పాత ఓటరు జాబితాలో తండ్రి పేరులో ఇంటి పేరు లేదని అధికారులు తిరస్కరించారు.
– బాలప్ప, మద్దెల్‌బీడు, దామరగిద్ద
అడిషనల్ కలెక్టర్: తప్పకుండా సంబంధిత బీఎల్వో, ఎన్నికల విభాగం అధికారులను సంప్రదించాలి. అర్హత ఉన్న ఓటర్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 11 ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుంది.


