కోస్గి: వినాయక చవితి ఉత్సావాల్లో భాగంగా పట్టణంలోని మున్నూర్ వాడలో వెలిసిన విజయ గణపతి మండపంలో నవరాత్రులు ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడి లడ్డూకు వేలంలో రికార్డు ధర పలికింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.14,31,999 పలికి చర్చకెక్కింది. విజయ గణపతి మండప మిత్రబృందం వేలంలో దక్కించుకున్నారు. కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నేడు డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం
నారాయణపేట: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం జిల్లాకేంద్రంలోని గాయత్రి ఫంక్షనన్‌హాల్‌లో నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30కి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం, మధ్యాహ్నం 12 గంటలకు డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కొడంగల్ ఇన్‌చార్జి్ తిరుపతిరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు హాజరుకావాలని కోరారు.
రేపటి నుంచి ఏటీఎల్
ఇన్‌చార్జిలకు శిక్షణ
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని 21 పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల్లో ఉన్న ఏటీఎల్ ల్యాబ్ ఇన్‌చార్జిలకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ టీజీఐఆర్‌డీ గోల్డెన్ జూబ్లీ బ్లాక్‌లో గురువారం నుంచి 26వ తేదీ వరకు మూడురోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పాఠశాలల నుంచి కచ్చితంగా ఒకరు మెటీరియల్ తీసుకొని ఉదయం 10 వరకు శిక్షణ కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు. శిక్షణకు హాజరుకాని వారిపై ఎస్పీడీ కఠిన చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాష్‌ను సంప్రదించాలని సూచించారు.
కొనసాగుతున్న ‘చేనేత’ నామినేషన్ల స్వీకరణ
ధన్వాడ: స్థానిక చేనేత సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం డైరెక్టర్ పదవుల కోసం 10 మంది నామినేషన్లు వేశారు. బుధవారం చివరిరోజు కావడంతో నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 29వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి అంజనేయులు తెలిపారు.


