నర్వ: పోషకాహారంపై ఆశాలు, అంగన్‌వాడీలు క్షేత్రస్థాయిలో బాలింతలు, గర్భిణులకు నిత్యం అవగాహన కల్పించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సూచించారు. మంగళవారం స్థానిక రైతువేదికలో జిల్లా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ పోషణమాసం ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై అంగన్‌వాడీ ఉపాధ్యాయులు తయారు చేసిన వివిధ రకాల పౌష్టికాహార పదార్థాలను ఆమె పరిశీలించారు. అనంతరం మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పోషణమా సం లక్ష్యాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. ఈ ఏడాది బెస్ట్ ఫీడింగ్ ప్రాక్టీస్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని.. శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలను తప్పనిసరిగా తాగించాలని సూచించారు. దీంతో శిశువుకు సహజ రోగనిరోధక శక్తి వస్తుందని.. ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. బాలింతలు పప్పులు, కూరగాయలు, పండ్లు అవసరమైన ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. శుభ్రత, స్థానికంగా లభించే ఆకుకూరలు ఎక్కువగా వినియోగించాలని ఫాస్ట్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాని సూచించారు. ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు ఆశాలు, అంగన్‌వాడీలు కృషి చేయాలని.. చిన్న వయస్సులో గర్భధారణ జరిగే సందర్భాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి అవసరమైన వైద్య పరీక్షలు, స్కానింగ్, ప్రసవ ప్రణాళిక అంశాలపై వైద్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, డీఎంహెచ్‌ఓ డా. జయచంద్రమోహన్, తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఇన్‌చార్జి సీడీపీఓ మమత, యాస్పిరేషన్ బ్లాక్ కో–ఆర్డినేటర్ బాలాజీ పాల్గొన్నారు.


