నారాయణపేట: కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సీఐటీయూ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్లతో వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తి భద్రత–ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు వచ్చాయన్నారు. బ్యాంకులు, బీమా, రవాణా, విద్యుత్, రైల్వేలు, రక్షణ, ఉక్కు, బొగ్గు, చమురు తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి వాటిని బలోపేతం చేయాలని సీఐటీయూ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడటం అంటే కార్మికుల ఉద్యోగాలతో పాటు ప్రజల ఆస్తులను పరిరక్షించడమేనని పేర్కొన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు పెరగడంతో శాశ్వత ఉద్యోగాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే పని చేస్తున్న కార్మికులకు సమాన వేతనం, ఉద్యోగ భద్రత, చట్టబద్ధమైన హక్కులు, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. అసంఘటిత, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు కూడా సామాజిక భద్రత కల్పించాలన్నారు. నిత్యావసర సరుకులు, ఇళ్లు, విద్య, వైద్యం, రవాణా, విద్యుత్, వంటగ్యాస్ ధరలు పెరుగుతుండటంతో కార్మిక కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందన్నారు. ధరల పెరుగుదలను నియంత్రించి కార్మిక కుటుంబాలు గౌరవంగా జీవించే స్థాయిలో వేతనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యువతకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు యువతను అనిశ్చిత ఉపాధి వైపు నెట్టే విధానాలను మార్చాలన్నారు. కార్మిక సమస్యలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా దేశ రాజధాని ఢిల్లీలో తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఢిల్లీ మార్చ్‌లో కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద్‌రాజ్, బండమీది బలరాం, కోశాధికారి బాలమణి, జిల్లా ఉపాధ్యక్షుడు జోషి, నాయకులు కాశీనాథ్, భీంశప్ప తదితరులు పాల్గొన్నారు.


