నారాయణపేట: హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై, ప్రజాస్వామ్య వ్యవస్థకు బాటలు వేసిన సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరు కాగా.. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా.వినీత్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి.. కలెక్టర్, ఎస్పీతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధులు, స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక పరిణామం వెనుక ఎంతోమంది పోరాటయోధులు, అమరవీరుల త్యాగాలు ఉన్నాయన్నారు. వాటి ఫలితంగానే ప్రజాస్వామ్య తెలంగాణ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. రైతుభరోసా పథకం ద్వారా వానాకాలం 2026–27లో ఎకరాకు రూ. 12వేల చొప్పు న 1,82,031 మంది రైతుల ఖాతాల్లో రూ.259 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 2025–26లో 618 మంది రైతులు మరణించగా.. వారి నామినీలకు రూ.5 లక్షల చొప్పున రైతుబీమా రూ.30.90 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. వానాకాలం పంటల సాగుకు 18,251.94 మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
భూ పరిహారం రూ.366.95 కోట్లు
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 3,565 మంది రైతులకు చెందిన 2,356.02 ఎకరాలకు సంబంధించి ఇప్పటివరకు 3,112 మంది రైతులకు రూ.366.95 కోట్ల పరిహారం పంపిణీ చేసినట్లు చెప్పారు. మిగిలిన రైతులకు కూడా దశలవారీగా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని
ఆవిష్కరిస్తున్న
మంత్రి వాకిటి శ్రీహరి, చిత్రంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా.వినీత్
అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
భూ నిర్వాసితులందరికీ పరిహారం
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి


