నారాయణపేట: అర్హులైన రైతులు, విద్యార్థులు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, స్వయం సహాయక సంఘాలు, స్వయం ఉపాధి లబ్ధిదారులకు రుణా ల మంజూరులో బ్యాంకర్లు చొరవ చూపాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని బ్యాంకుల ద్వారా వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, విద్య, స్వయం సహాయక సంఘాలు, స్వయం ఉపాధి తదితర రంగాలకు, వివిధ ప్రభుత్వ పథకాల కింద మంజూరైన రుణాల పురోగతిని కేటగిరీల వారీగా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. రుణాల మంజూరులో సిబిల్ స్కోర్‌ను ఒక ప్రమాణంగా పరిగణించినప్పటికీ, అర్హత ఉన్న లబ్ధిదారులకు రుణాలు పొందడంలో అనవసర ఇబ్బందులు కలిగించరాదని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పథకాల లక్ష్యాలను చేరుకునేలా బ్యాంకర్లు శాఖల వారీగా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని కొన్ని బ్యాంకులు రుణాల మంజూరులో వెనుకబడి ఉన్నాయని.. పనితీరును మెరుగుపర్చుకొని నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన తదితర పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు నిర్ణీత గడువులోగా రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణాల ద్వారా ఉపాధి అవకాశాలు, స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరిగేలా బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలన్నారు. కాగా, 2026–27 వార్షిక ప్రణాళికలో భాగంగా జూన్ 2026తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి మొత్తం రూ.4,524.76 కోట్ల బడ్జెట్ లక్ష్యానికి గాను రూ.1,815.91 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇది వార్షిక ప్రణాళికలో 40.13 శాతం పురోగతి అని అన్నారు. ఎంఎస్‌ఎంఈ విభాగంలో రూ.324.80 కోట్ల లక్ష్యానికి గాను రూ.108.67 కోట్ల రుణాలు మంజూరయ్యాయన్నారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.4,101.55 కోట్లు కేటాయించగా.. రూ.810.81 కోట్ల రుణాలు మంజూరు చేయడంతో 19.77 శాతం పురోగతిగా నమోదైందన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సురేష్ ఆత్రేయ, ఆర్బీఐ ఎల్‌డీఓ శ్రీకాంత్, ఎస్‌బీఐ ఏజీఎం ఫఫిర్, నాబార్డ్ డీడీఎం మహేందర్, యూబీఐ టి.రాజేశ్, డీఆర్డీఏ అధికారి వెంకట్రాములు, డీఏఓ సక్రియానాయక్, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి అబ్దుల్ ఖలీల్ ఉన్నారు.


