నారాయణపేట: ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) భవన నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, మినిస్టర్ చాంబర్‌తో పాటు వివిధ విభాగాల్లో కొనసాగుతున్న పనులు, టాయిలెట్లు, నీటి సదుపాయం, ఆర్వో ప్లాంట్, వైరింగ్ తదితర పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ అధికారులు పెండింగ్ పనులను పూర్తిచేసి భవనాన్ని వినియోగానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశ మందిరంలో అవసరమైన తెర ఏర్పాటు చేయాలని, భవనం పరిసరాల్లో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పచ్చదనం పనులు పూర్తి కావాలని సూచించారు. ఆమె వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ, డీఈ రాములు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


