కోస్గి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తోందని డీఆర్డీఓ, ఇన్‌చార్జి డీపీఓ వెంకట్రాములు తెలిపారు. శుక్రవారం గుండుమాల్ రైతువేదికలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లు, గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ కేంద్ర భవనాలు, పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణాలు వేగంగా చేపట్టాలన్నారు. గ్రామాల అభివృద్ధికి నాయకులు, అధికారులు ప్రణాళికలు తయారుచేసి అందజేయాలని, ప్రత్యేకంగా కడా నిధులు సైతం మంజూరవుతున్నామని తెలిపారు. పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు రావడం లేదని పైపులైన్ లీకేజీల మరమ్మతు చేపట్టాలన్నారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత, ఫాంపాండ్స్, పబ్లిక్ టాయిలెట్స్, నీటి నిల్వ కోసం భూములను గుర్తించాలని సూచించారు. ప్రతి గ్రామంలో అర్హులకు చేయూత పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు వివిధ శాఖల మండల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. గైర్హాజరైన అధికారులపై చర్యలు తప్పవని.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జ్యోత్స్న, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


