అభివృద్ధి మాటున దోపిడీ | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి మాటున దోపిడీ

Sep 4 2026 1:36 AM | Updated on Sep 4 2026 1:36 AM

దోపిడీపై విజిలెన్స్‌ విచారణ జరపాలి..

ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం

కోస్గి రైతు గర్జనసభలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి

కోస్గి: రాష్ట్రంలో అమలుకు సాధ్యం కాని మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ పాలనలో పూర్తిగా విఫలమైందని.. అభివృద్ధి పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనను పురస్కరించుకొని బీఆర్‌ఎస్‌ పార్టీ గురువారం రైతు గర్జన పేరిట కోస్గిలో నిరసన కార్యక్రమం చేపట్టింది. స్థానిక రామాలయం చౌరస్తా నుంచి శివాజీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో వారితో పాటు, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన కేిసీఆర్‌ కిట్టు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రస్తుత ప్రభుత్వం తొలగించిందన్నారు. పాలమూర్‌ జిల్లాలో చాలామంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారేనని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక గతంలో వలస వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చి పంటలు పండించుకొని అభివృద్ధి చెందారన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో మరోమారు వలసలు మొదలయ్యాయని, యూరియా కోసం చెప్పులు వరుసలో పెట్టాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, సన్నరకం వరికి బోనస్‌ అమలు కావడం లేదన్నారు. కేసీఆర్‌ హయాంలోనే పాలమూర్‌ ఎత్తిపోతల పథకం చేపట్టి 90 శాతం పనులు పూర్తి చేశామని.. నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లు పూర్తిచేస్తే ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులకు టెండర్లు వేసి కాల్వలు కూడా తవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. వెలుగొండ, పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు ఆంధ్రాకు తరలిస్తున్నారని, ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్రానికి నీళ్లు రాకపోగా ఉన్నా నీరు వాడుకునే పరిస్థితి లేదని తెలిపారు. భూముల్ని దోచుకోవడానికి 22ఏ అమలు చేసి రైతులను దోచుకుంటున్నారన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సూచించిన విధంగా అభివృద్ధి పేరిట జరుగుతున్న పనుల్లో అవినీతి, అక్రమాలపై విజిలెన్స్‌ విచారరణ జరపాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సవాల్‌ విసిరారు. సొంత పార్టీ మంత్రి కొండా సురేఖ ఢిల్లీ కేంద్రంగా బహిరంగంగానే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పడం చూస్తే పరిస్థితి అర్థమవుతుందన్నారు. మహబూబ్‌నగర్‌ రూపురేఖలు మార్చిన ఘనత మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌దేనని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతూ మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని ధర్నాలు, నిరసనలతో మేల్కొలుపుతోందని చెప్పారు. పాలమూర్‌ ప్రాంతానికి నీరు అందించే ఆలోచన రేవంత్‌రెడ్డికి లేదని.. కేసీఆర్‌ ఉండి ఉంటే ఇప్పటికే కొడంగల్‌కు సాగునీరు అందించేవారన్నారు. కొడంగల్‌, పరిగిలో రైతుల భూముల్ని లాక్కొని భూ బకాసురులుగా మారిన రేవంత్‌ సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులిచ్చి రేవంత్‌రెడ్డి సోదరుడు 20 శాతం కమీషన్లు తీసుకుంటూ ఇష్టారీతిన దోచుకుంటున్నారన్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరిట రైతుల భూముల్ని లాక్కుంటున్నారని.. దోచుకోవడమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకట నర్సింహులు, మహిపాల్‌, బాలు, సాయప్ప, శివకుమార్‌, మోహన్‌గౌడ్‌, జనార్దన్‌రెడ్డి, హుసేనప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement